భర్త వేధింపులకు భార్య బలి | - | Sakshi
Sakshi News home page

భర్త వేధింపులకు భార్య బలి

Oct 7 2025 3:53 AM | Updated on Oct 7 2025 3:53 AM

భర్త వేధింపులకు భార్య బలి

భర్త వేధింపులకు భార్య బలి

దొడ్డబళ్లాపురం: ఆడపిల్ల పుట్టిందని భర్త వేధిస్తుండడంతో కలత చెందిన భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు లగ్గెరె లోని మునేశ్వర బ్లాక్‌లో జరిగింది. రక్షిత (26) మృతురాలు. ఈమెకు 4 ఏళ్ల క్రితం కుణిగల్‌కు చెందిన రవీశ్‌తో పెళ్లయింది. లగ్గెరెలో నివసిస్తున్నారు. వీరికి ఒక ఆడపిల్ల ఉంది. ఆడపిల్ల పుట్టింది, మగపిల్లాడు లేడంటూ రవీశ్‌ నిత్యం భార్యను నరక యాతనకు గురిచేసేవాడు. దీంతో ఆవేదన చెందిన రక్షిత ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ కుమార్తెను రవీశ్‌ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని రక్షిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చిన్నారిని చిదిమిన కారు

శివాజీనగర: రివర్స్‌ తీసుకునేటపుడు కారు మీద నుంచి వెళ్లడంతో 11 నెలల బాలుడు బలైన ఘటన బెంగళూరు కామాక్షిపాళ్య ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి కెంపేగౌడ నగరలో సోమవారం ఉదయం జరిగింది. వివరాలు.. స్వామి అనే వ్యక్తికి అక్కడ నాలుగు ఇళ్లు ఉండగా బాడుగకు ఇచ్చాడు. వీటిలో ఒక ఇంట్లో ఉండే బంధువులను చూడాలని కుణిగల్‌ నుంచి వారం క్రితం ఓ కుటుంబం వచ్చింది. వారి పిల్లాడు అజాన్‌ (11 నెలలు) ఇంటి బయట ఆడుకుంటూ ఉన్నాడు. చిన్నారిని చూడకుండా యజమాని స్వామి కారును రివర్స్‌ తీసుకొన్నారు. కారు బాలుని మీద నుంచి వెళ్లిపోయింది. చిన్నారి ఆర్తనాదాలు విని తల్లిదండ్రులు పరుగున వచ్చి దగ్గరిలోని ఆసుపత్రికి తీసుకొళ్లారు, తీవ్ర గాయాలైనందున బాలుడు కొంతసేపటికే మరణించాడు. స్వామిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కులగణన ఉద్యోగిపై దాడి

మండ్య: మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణంలో కులగణన సమీక్ష కోసం ఇంటింటికీ తిరుగుతున్న ఉద్యోగి మీద ఓ వ్యక్తి దాడి చేసి దాఖలాలను చించిపడేశాడు. గంజాం ప్రాంతంలో అబ్దుల్‌ గఫార్‌ అనే వ్యక్తి కులగణన కోసం వచ్చిన ఉద్యోగి జనార్ధన్‌ పైన దాడి చేశాడు. రేషన్‌ కార్డు, కుటుంబ సభ్యుల వివరాలను ఇవ్వాలని గఫార్‌ను ఆయన అడిగాడు, దానికి అతడు నిరాకరించడంతో పాటు వాదనకు దిగి ఇష్టానుసారం దూషించి కొట్టాడు. దాఖలాలను లాక్కుని చించి పడేశాడు. దీంతో జనార్ధన్‌ కన్నీరుమున్నీరయ్యాడు.

వృద్ధుడు డిజిటల్‌ అరెస్టు, రూ. 21 లక్షలు దోపిడీ

మైసూరు: ఈడీ అధికారులమంటూ వృద్ధున్ని బెదిరించి రూ.21.5 లక్షలను ఆన్‌లైన్‌లో దోచుకున్నారు. మైసూరులో ఈ ఘరానా మోసం జరిగింది. వివరాలు.. మేటెగళ్ళికి చెందిన వృద్ధుడు (77)కి దుండగులు వాట్సాప్‌లో వీడియో కాల్‌ చేశారు. తాము ఈడీ అధికారులమని, నీ వద్ద అక్రమ నగదు ఉందని సమాచారం వచ్చిందని బెదిరించారు. నిన్ను బంధించి తనిఖీ చేయాలని కేసు నమోదైందని, ఇందుకు సహకరించాలన్నారు. నీ బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును వెంటనే తాము చెప్పిన బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలని, నీవు ఏ తప్పు చేయకుంటే నగదు వెంటనే వెనక్కి పంపిస్తామని అన్నారు. భయభ్రాంతులకు గురైన వృద్ధుడు తన ఖాతాల్లో ఉన్న రూ.21.5 లక్షలను వారికి బదిలీ చేశాడు. తరువాత దుండగుల ఫోన్‌ స్విచాఫ్‌ కావడంతో మోసపోయానని తెలిసి సైబర్‌ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు.

చిరుత పట్టివేత

మైసూరు: చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటె తాలూకాలోని కరకలమాదళ్ళి గ్రామంలో కొన్నిరోజులుగా ఓ చిరుత చొరబడుతోంది. మేకలు, గొర్రెలను చంపి ఎత్తుకెళ్తోంది. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు అటవీ అధికారులు బోనులు ఏర్పాటు చేయగా, ఆదివారం రాత్రి చిరుత బోనులోకి చిక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement