వలస పక్షుల అడ్డా అంకసముద్ర | - | Sakshi
Sakshi News home page

వలస పక్షుల అడ్డా అంకసముద్ర

Oct 7 2025 4:15 AM | Updated on Oct 7 2025 4:15 AM

వలస ప

వలస పక్షుల అడ్డా అంకసముద్ర

సాక్షి,బళ్లారి: ఈసారి ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచి తుంగభద్ర డ్యాంలోకి నీరు పుష్కలంగా చేరడంతో పాటు స్థానికంగా వర్షాలు బాగా కురవడంతో ఉమ్మడి జిల్లాలోని హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని అంకసముద్ర చెరువు కూడా కళకళలాడుతోంది. అంకసముద్ర చెరువు అంటే ప్రత్యేకంగా నీరు నిల్వ ఉండే చెరువుగా ఉమ్మడి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందింది. దీంతో ఇక్కడికి దేశ, విదేశీ వలస పక్షులు తరలి వచ్చి సందడి చేయడంతో పక్షిప్రేమికులకు అంకసముద్ర స్వర్గధామంగా మారింది. సాధారణంగా ప్రతి ఏటా దేశ, విదేశీ పక్షులు నవంబర్‌ నుంచి అంకసముద్ర చెరువుకు రావడం ఆనవాయితీ కాగా ఈ ఏడాది ముందస్తు వర్షాలతో చెరువు కళకళలాడుతుండటంతో పాటు దేశ, విదేశీ పక్షులు కూడా సెప్టెంబర్‌ నెల నుంచి రావడం ప్రారంభం కావడంతో అంకసముద్ర చెరువులో పక్షుల కిలకిలరావాలతో పర్యాటకుల సందడి రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతున్న హంపీ కరడిధామ, తుంగభద్ర డ్యాం, ప్రముఖ పుణ్యక్షేత్రాలతో ఉమ్మడి బళ్లారి జిల్లా పేరు దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో ఉమ్మడి బళ్లారి జిల్లాలో పక్షుల కాశీగా అంకసముద్ర కూడా చేరిపోవడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

పక్షి ప్రేమికులను మరిపిస్తున్న వైనం

రాష్ట్రంలోనే అరుదైన పక్షిధామంగా పేరొందిన అంకసముద్ర చెరువులో పెయింటెడ్‌ స్టార్ట్‌, పెలికాన్‌, స్పూన్‌ బిల్లు, ఓపెన్‌ బిల్లు స్టార్ట్‌, గ్రోటర్‌ కార్మోరేట్‌, విదేశాలకు చెందిన బ్రాహ్మణీ బాతు, బ్లాక్‌ టెయిల్డ్‌ గాడ్‌ వీట్‌, మార్స్‌ స్యాండ్‌ పైపర్‌, యూరేషియన్‌ కర్లివ్‌, సైబోరియన్‌ స్టోన్‌ చాట్‌, కర్లివ్‌ స్యాండ్‌ పైపర్‌ తదితర 87 జాతులకు చెందిన పక్షులు విచ్చేయడంతో అంకసముద్ర చెరువు పక్షి ప్రేమికులను మైమరిపిస్తున్నాయి. దేశ, విదేశాల నుంచి 100 రకాలకు పైగా జాతి పక్షులు వస్తుండటంతో పక్షి ప్రేమికులను ఉదయం, సాయంత్రం వేళల్లో కనువిందు చేస్తున్నాయి. ఉదయం వేళల్లో బయటకు ఆహారం వెళ్లే పక్షులు ఉదయం బయటకు వెళ్లేటప్పుడు, సాయంత్రం తిరిగి మళ్లీ పక్షిగూటికి వచ్చేటప్పుడు పక్షి ప్రేమికులు అక్కడికి చేరుకుని పక్షులను వీక్షించి ఆహ్లాదం పొందుతున్నారు. ముఖ్యంగా అంతరించిపోతున్న అరుదైన నీటి కుక్కలు సందడి చేస్తున్నాయి. ఈ నీటి కుక్కలు(నీరునాయి) పర్యాటకులకు మరింత కనువిందు చేస్తున్నాయి. అంకసముద్ర గ్రామ సమీపంలో విజయనగర రాజుల కాలంలో కట్టించిన ఈ చెరువు దాదాపు 250 ఎకరాల్లో విస్తరించి పక్షులకు నిలయంగా మారింది. తుంగభద్ర నది నుంచి ఏడాది పొడవునా నీరు సరఫరా చేస్తుండటంతో ఎప్పటికప్పుడు ఈ చెరువు ఖాళీ కాకపోవడం విశేషం. దీంతో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అరుదైన పక్షులు ఇక్కడ ఏడాది పొడవునా వచ్చి వెళుతుంటాయి.

చెరువులో 100కు పైగా రకాల పక్షుల సందడి

దేశ, విదేశీ పక్షుల రాకతో సందర్శకులకు కనువిందు

పక్షిప్రేమికులకు నిలయంగా చెరువు

దాదాపు 100కు పైగా అందమైన పక్షుల రాకతో ప్రముఖ పక్షుల విడిది కేంద్రంగా, పక్షిధామంగా, పక్షిప్రేమికులకు నిలయంగా ఈ చెరువు విరాజిల్లుతోంది. నీటి కుక్కలు అంకసముద్ర చెరువులో చేస్తున్న నృత్యాలు పర్యాటకులను మరింత ఆనందోత్సవాల్లో ముంచెత్తుతున్నాయి. కలుషిత నీరు రాకుండా కొత్త నీటిలోనే ఈ నీటి కుక్కలు నివాసం ఉంటాయని పక్షి ప్రేమికుడు విజయ్‌ పేర్కొంటున్నారు. పేరుకు నీటికుక్కలు పిలుస్తారే కాని కుక్కల జాతికి చేరిన పక్షులు కావని, ఇవి అరుదైన ఒక రకమైన పక్షిజాతికి చేరినవి అన్నారు. వీటితో వివిధ రకాల అందమైన పక్షులు రావడంతో పెద్ద సంఖ్యలో జనం వచ్చి వీక్షించి చూసి ఆనందిస్తుంటారన్నారు. భారతదేశంతో పాటు బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, నేపాల్‌, థాయ్‌లాండ్‌, మలేషియా, ఇండోనేషియా దేశాల్లో మాత్రమే ఈ నీటి కుక్కలు కనిపిస్తాయని, చెరువుల్లో నీటిశుభ్రత చేసే అరుదైనవని గుర్తించారు. జనం కనిపిస్తే ఒకింత సిగ్గుపడుతూ వయ్యారాలు ఒలకబోస్తే అటు, ఇటు తిరగడం వల్ల పక్షిప్రేమికుల మనస్సులను కట్టిపడేస్తున్నాయన్నారు. ఎంతో చారిత్రాత్మక నేపథ్యం, ప్రపంచ పర్యాటక కేంద్రాలు ఉన్న ఉమ్మడి బళ్లారి జిల్లాలోని అంకసముద్ర చెరువు పక్షులకు స్థావరంగా ఏర్పాటు చేసుకోవడంతో ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న ఉమ్మడి బళ్లారి జిల్లాలో పక్షుల స్వర్గధామంగా కూడా గుర్తింపు పొందడం విశేషం.

వలస పక్షుల అడ్డా అంకసముద్ర 1
1/1

వలస పక్షుల అడ్డా అంకసముద్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement