
కేంద్రానికి బిహార్ తప్ప కర్ణాటక గుర్తు రాదా?
రాయచూరు రూరల్ : రాష్ట్రంలో అతివృష్టి, వరదలతో 17 జిల్లాల్లోని రైతులు పంట పొలాల్లో వేసుకున్న పంటలు సరిగా పండక, పశుగ్రాసం లేక తల్లడిల్లిపోతున్నామని, పంట నష్టపరిహారం అందించాలని కోరుతూ వ్యవసాయ కూలి కార్మికులు ఆందోళన చేపడుతున్నారు. బాధితులు జీవితం ఎలా గడపాలా? అనే ఆలోచనలో ఉన్న సందర్భంలో తక్కువ పరిహారం అందించాలని అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు తమకేమి పట్టనట్లు ఉండటంపై రైతులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. కల్యాణ కర్ణాటకలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ఆలకించే తహసీల్దారే మాయం కావడంతో బాధితుల్లో విచారం వ్యక్తం అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ కార్యదర్శులు, అధికారులు రైతులను చూసిన వెంటనే పరుగెడుతున్నారు. పంట నష్టపరిహారం కోసం 10 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నా ఫలితం లేకుండా పోయిందని రైతులు వాపోయారు. రాష్ట్రంలో బాధితులు, రైతులు, పేదలు అన్నమో రామచంద్రా అంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు మౌనం వహించడాన్ని రైతులు తప్పుబడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ ట్విట్టర్‌లో సందేశాలు పంపుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం
రాష్ట్రంలో 17 జిల్లాల్లో 80 తాలూకాలో భారీ వరదలు సంభవించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయి. రాష్ట్రం నుంచి 25 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నా వారి మౌనం ఎందుకో అర్థం కావడం లేదు. 2009లో వరదలు వచ్చిన సమయంలో అప్పటి ప్రధానమంత్రి మన్‌మోహన్ సింగ్ పరిహారం ప్రకటించిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో 40 మంది మృతి చెందగా, రూ.50 వేల కోట్ల మేర నష్టం సంభవించినా కేంద్రంలోని నేతలు నరేంద్ర మోదీ, అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌లు కర్ణాటకను మరిచి బిహార్‌లో త్వరలో జరుగనున్న ఎన్నికలకు ఆపస్న హస్తం అందించడం ఎంత వరకు సమంజసం అనే ప్రశ్న నెలకొంది. బిహార్‌కు రూ.10,219 కోట్లు, కర్ణాటకకు రూ.3,705 కోట్లు, తెలంగాణకు రూ.2,136 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,112 కోట్లు, మహారాష్ట్రకు రూ.6,418 కోట్లు, తమిళనాడుకు రూ.4,144 కోట్ల నిధులు కేటాయించారు.
పరిహారం కోసం రైతుల వెంపర్లాట
కేంద్ర ప్రభుత్వానికి ట్విట్టర్‌లో సందేశాలు
17 జిల్లాల్లోని 80 తాలూకాల్లో భారీ వరదలు
రాష్ట్రానికి చెందిన 25 మంది లోక్‌సభ సభ్యులు మౌనం
2009లో వరదలకు కాంగ్రెస్ సర్కార్ పరిహారం ప్రకటన
40 మంది మృతి, రూ.50 వేల కోట్ల మేర వాటిల్లిన నష్టం

కేంద్రానికి బిహార్ తప్ప కర్ణాటక గుర్తు రాదా?