
ఐటీ ఫైలింగ్.. రేషన్ కటింగ్
శివాజీనగర: లేదు.. లేదంటూనే రాష్ట్రంలో బీపీఎల్ రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అనర్హులనే పేరుతో అన్నభాగ్య కార్డుల తొలగింపు చేపట్టింది. రేషన్ స్టోర్లలో తొలగించిన కార్డుల జాబితాను ప్రదర్శిస్తోంది. మీ కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.20 లక్షలకు పైబడింది. అందుచేత మీ రేషన్‌ను రద్దు చేయబోతున్నాం, ఈ నెల చివరిసారిగా రేషన్ ఇస్తాం, వచ్చే నెల నుంచి బంద్ అని అందులో పేర్కొన్నారు.
ఆ ఒక్క కారణంతో
రైతులు సేద్యం కోసం రూ. లక్ష, అంతకు మించి అప్పులు తీసుకోవాలంటే ఐటీ ఫైలింగ్ ను చేయాలి, అదే ఎంతోమంది కార్డుల రద్దుకు కారణమైంది, మీరు ఐటీ పన్ను చెల్లింపుదారులు కాబట్టి కార్డును తీసేస్తున్నాం అని అధికారులు చెప్పేస్తున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలవారు పిల్లల చదువులకు, బైక్‌లు కొనడానికి, ఇతరత్రా అవసరాలకు రుణం పొందినా అది కార్డుకు సమస్య అవుతోంది.
ఐటీ ఫైలింగ్‌కు బ్యాంకుల ఒత్తిళ్లు
రుణం ఇవ్వాలంటే బ్యాంకుల సిబ్బంది ఐటీ ఫైలింగ్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని పలువురు బాధితులు వాపోయారు. ఐటీ ఫైలింగ్ చేస్తున్న కార్డుదారుల ఆధార్, పాన్ కార్డు వివరాలను పౌరసరఫరా శాఖ సేకరించి వేటు వేస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్రంలో పలువురి రేషన్ కార్డుల రద్దయినట్లు అధికార వర్గాల సమాచారం. కార్డు కలిగిన కుటుంబంలో ఎవరైనా ఒక్కరు ఐటీ ఫైలింగ్ చేసినా, ఆదాయపు పన్ను కట్టినా కార్డు కట్ అవుతోంది. ఆ కుటుంబాన్ని స్థితిమంతులుగా సర్కారు పరిగణిస్తోంది.
ఆ కారణంతో రేషన్ కార్డులను
తొలగిస్తోన్న సర్కారు
స్టోర్ల ముందు జాబితాలు

ఐటీ ఫైలింగ్.. రేషన్ కటింగ్