
ఆవు కళేబరంలో విషం పెట్టి..
మైసూరు: చామరాజనగర జిల్లాలోని హనూరు తాలూకాలోని మలెమహాదేశ్వర అభయారణ్యంలోని పచ్చెదొడ్డిలో పెద్ద పులిని చంపిన కేసులో నలుగురిని అటవీ సిబ్బంది అరెస్టు చేశారు. పచ్చెదొడ్డివాసులు పచ్చమళ్ళ, గణేష్, గోవిందగౌడ, సంపు నిందితులు. వారిని కొళ్లేగాల ఆస్పత్రికి తీసుకువచ్చి వైద్యపరీక్షలు చేసి అదుపులోకి తీసుకున్నారు. తమ ఆవులు, గొర్రెలపై పులి దాడి చేస్తోందనే కోపంతో ఆవు కళేబరంలో విషం కలిపి పెట్టారు, దానిని తిన్న పులి మృత్యువాత పడింది. ఆ పులి శరీరాన్ని ముక్కలుగా నరికి పడేశారు. ఆవు కళేబరం కోసం అటవీ సిబ్బంది గాలిస్తున్నారు. కంబన్న, మంజునాథ్ అనే గొర్రెల కాపరులను విచారిస్తున్నారు.
ఇలా బయటపడింది
అటవీ సిబ్బంది అడవిలో గస్తీ తిరుగుతుండగా భూమిలో సగం పాతిపెట్టిన పులి కళేబరం కనిపించింది. దీంతో విచారణ జరపగా గుట్టు రట్టయింది. పులి గోర్లు, కోరలు, 4 కాళ్లు లభించాయి. మగ పులి అని, 12 ఏళ్ల వయసని నిర్ధారించారు. కొన్నినెలల కిందట కూడా పశువులను చంపివేస్తోందని ఇదే మాదిరిగా తల్లి పులి, నాలుగు పిల్లలను కొందరు హతమార్చడం తెలిసిందే. అంతలోనే మరో ఘటన జరగడంతో ఈ ప్రాంతంలో పులుల భద్రత ప్రశ్నార్థకమైంది. అరుదైన వన్యప్రాణులపైన పులులను కాపాడడం గురించి అటవీశాఖ ప్రజల్లో జాగృతి కల్పించాలనే డిమాండ్లు వస్తున్నాయి.
పులిని చంపిన నలుగురు అరెస్టు
వన్యప్రాణులకు రక్షణ కరువు

ఆవు కళేబరంలో విషం పెట్టి..