రైతన్నకు తప్పని ఎదురు చూపులు | - | Sakshi
Sakshi News home page

రైతన్నకు తప్పని ఎదురు చూపులు

Oct 8 2025 8:03 AM | Updated on Oct 8 2025 8:03 AM

రైతన్నకు తప్పని ఎదురు చూపులు

రైతన్నకు తప్పని ఎదురు చూపులు

సాక్షి,బళ్లారి: ఆరుగాలం కష్టపడి పని చేసి పంటలు పండించిన రైతన్నలకు పంట చేతికందేలోపు, ప్రతి ఏటా ఏదో రకంగా నష్టపోతూ తీవ్రంగా నష్టపోవాల్సిన దయనీయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచి వర్షాలు బాగా కురవడంతో అదునులోనే దుక్కులు దున్ని, సకాలంలో మొక్కజొన్న, రాగి, సజ్జ. వేరుశనగ తదితర విత్తనాలు వేయడంతో పాటు చెరుకు, వరి తదితర పంటలను కూడా విస్తృతంగా సాగు చేశారు. వీటితో పాటు పండ్ల తోటలు కూడా బాగా కళకళలాడాయి. అయితే పంట చేతికందే సమయంలో సెప్టెంబర్‌ మూడో వారం చివర, నాలుగో వారంలో కురిసిన భారీ వర్షాలు ఉత్తర కర్ణాటక జిల్లాలను అతలాకుతలం చేశాయి. దీంతో ఉత్తర కర్ణాటక పరిధిలోని విజయపుర, బాగల్‌కోటె, కొప్పళ, రాయచూరు, గదగ్‌, బళ్లారి, ధారవాడ, బెళగావి ముఖ్యంగా కలబుర్గి తదితర జిల్లాల్లో దాదాపు 25 లక్షల ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న, చెరుకు, వరి, పత్తి, వేరుశనగ తదితర పంటలతో పాటు దానిమ్మ, జామ, ద్రాక్ష తదితర పండ్ల తోటలు కూడా పెద్ద ఎత్తున నీట మునిగి రైతులను నిండా ముంచేశాయి. చెరుకు తదితర పంటలకు ఒక ఎకరాకు రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టి పంట చేతికందుతుందనే సమయంలో ఒక్కసారిగా వరుణుడి ప్రతాపంతో పంటలు పూర్తిగా నష్టపోవాల్సిన దుస్థితులు కనిపిస్తున్నాయి.

వైమానిక సర్వేతో సరిపెడుతున్న

సీఎం సిద్ధరామయ్య

లక్షలాది ఎకరాల్లో ఎటు చూసినా పంటలు నీటమునిగిన దృశ్యాలతో పాటు ఎక్కడ చూసినా పంటలు కుళ్లిపోయిన దృశ్యాలే కనిపించాయి. ఉల్లిగడ్డలు తదితర పంటలు కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్న దృశ్యాలు కోకొల్లలు. ఇలా రైతాంగం పూర్తిగా నష్టపోయి తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సీఎం సిద్ధరామయ్య కంటి తుడుపు చర్యగా అతివృష్టి ప్రాంతాల్లో వైమానిక సమీక్ష జరిపి చేతులు దులుపుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా తూతూమంత్రంగానే పని చేస్తున్నారు. దీంతో తమకు సరైన న్యాయం జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో పాటు పలు గ్రామాల్లో ఇళ్లు నేలమట్టం కావడం, రోడ్లు అస్తవ్యస్తం అయిన దృశ్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. వీటి గురించి కూడా సక్రమమైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ఒక ఎకరానికి రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టిన రైతులకు ఒక రూపాయి కూడా చేతికందని పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్షాధారిత భూములకు ఒక హెక్టారుకు రూ.17 వేలు, నీటిపారుదల సదుపాయం కలిగిన భూములకు ఒక హెక్టారుకు రూ.34 వేల చొప్పున పరిహారం కలిపి ఉత్తర కర్ణాటక పరిధిలోని అన్ని జిల్లాలకు అతివృష్టి వల్ల పంట నష్టపోయిన రైతులకు దాదాపు రూ.2500 కోట్లు ప్రకటించారు.

పంట నష్టపరిహారం కోసం అన్నదాతల పాట్లు

రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమ అయ్యేదెన్నడో?

లక్షలాది ఎకరాల్లో పంట నష్టమైనా కంటితుడుపు చర్యలే.!

అతివృష్టి వల్ల 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే కంటి తుడుపు చర్యలకు ప్రభుత్వాలు సిద్ధం కావడంపై రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రకటించిన నగదు కూడా రైతుల ఖాతాల్లో ఎప్పుడు జమ అవుతుందోనని, ఎవరెవరికి పడుతుందోనని కూడా ఆందోళన చెందుతున్నారు. పంట నష్టంతో పాటు భారీ వర్షాల వల్ల 50 మందికిపైగా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. దాదాపు 500 పశువులు కూడా మరణించాయి. ఇలా వివిధ రకాలుగా ఈ ప్రాంతంలో రైతాంగం పూర్తిగా నష్టపోయి ప్రభుత్వం అందించే పరిహారం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పరిహారం రైతులకు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని, మళ్లీ రైతులు ఎలా జీవించాలని రైతు సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఒక ఎకరానికి కనీసం రూ.50 వేలకు పైగా పంట నష్ట పరిహారం అందించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రకటించిన పరిహారం కూడా వీలైనంత త్వరలో రైతులకు అందేలా గట్టి చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement