
23 నుంచి వైభవంగా కిత్తూరు ఉత్సవాలు
హుబ్లీ: ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా ఈనెల 23, 24, 25 తేదీల్లో మూడు రోజుల పాటు కిత్తూరు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తాం. ఈ సారి రాష్ట్రానికే ప్రసిద్ధి చెందిన వ్యక్తి చేతుల మీదుగా ప్రారంభింప చేస్తామని బెళగావి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సతీష్ జార్కిహోళి తెలిపారు. చెన్నమ్మన కిత్తూరులో కిత్తూరు ఉత్సవాల ముందస్తు సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లాధికారులతో సోమవారం సమావేశం నిర్వహించాం. దీని తర్వాత మరో సమావేశం నిర్వహిస్తాం. మొత్తానికి మూడు సమావేశాలు నిర్వహించి ఉత్సవాలకు తుది రూపం ఇస్తామన్నారు. నిర్వహణ కోసం 17 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. వర్ధమాన కళాకారులకు తగిన ప్రాధాన్యతను ఇవ్వాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారన్నారు. వివిధ సమస్యలను పరిష్కరించే దిశలో సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నాం. ఎమ్మెల్యే బాబా సాహెబ్ పాటిల్ సారథ్యంలో ఈ సారి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. కిత్తూరు అభివృద్ధి ప్రాధికారకు నిధుల విడుదలలో పక్షపాత ధోరణిపై అడిగిన ప్రశ్నకు సంగొళ్లి అభివృద్ధి ప్రాధికార ద్వారా సంగొళ్లి, నందగడలో అనేక నిర్మాణ పనులను చేపట్టినందు వల్ల దానికి ఎక్కువ నిధులు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రాధికార అధ్యక్షుడు ఆయా రెవెన్యూ మంత్రిని కలిసి కిత్తూరు అభివృద్ధి ప్రాధికారకు ఎక్కువ నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానన్నారు.

23 నుంచి వైభవంగా కిత్తూరు ఉత్సవాలు