
రైతులను నిండా ముంచిన వర్షాలు
రాయచూరు రూరల్: ఉత్తర కర్ణాటక, కల్యాణ కర్ణాటక జిల్లాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. మాన్వి, దేవదుర్గ గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాలు జలమయమయ్యాయి. పత్తి, మిరప, వరి, కందులు, ఉల్లిగడ్డలు, పొద్దు తిరుగుడు పంటలు నీటిలో తడిశాయి. పత్తి, ఉల్లి గడ్డల పంటలు రైతులకు వరంగా మారాల్సింది పోయి నేడు చిరు జల్లులకు పంట చిత్తడిగా మారింది. పత్తి, ఉల్లి గడ్డల పంటలకు నీరు సోకడంతో పూర్తి ముద్దగా మారి పురుగుల బెడద అధికమైంది. దీంతో రైతులకు పత్తి, ఉల్లి గడ్డల పంటలు శాపంగా పరిణమించాయి. అతివృష్టితో నేడు చేతికొచ్చిన పంటలు పనికి రాకుండా పోతున్నాయి. జిల్లాలో మమదాపుర, కల్లూరు, మటమారి, నెలెహాళ, బాగల్‌కోటె జిల్లాలో 31 వేల హెక్టార్లలో ఉల్లిగడ్డలు, ఇతర ప్రాంతాల్లో పత్తి చెట్లకున్న కాయలకు మరో సారి విత్తనాలు మొలకెత్తడం, కొన్నింటికి పురుగులు పడటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. జిల్లాలో 1,79,236 హెక్టార్లలో పత్తి పంటలు వేశారు. రైతులు ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల దాకా వ్యయం చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో పత్తి ధరలు క్వింటాల్‌కు రూ.7,500 ధర పలుకుతోంది. చిరు జల్లులకు పాడైన ఉల్లిగడ్డలు, పత్తి కొనుగోలుకు వ్యాపారులు తక్కువ ధరకు కొంటారని రైతులు వాపోతున్నారు. పాడైన పత్తి, ఉల్లి గడ్డల పంట నుంచి నష్ట పోయిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని కోరుతున్నారు.
ఉత్తర కర్ణాటక, కల్యాణ కర్ణాటకలో కురిసిన వానలు
ఉల్లి, పత్తి, మిరప, కంది తదితర పంటలకు నష్టం

రైతులను నిండా ముంచిన వర్షాలు