
జిల్లాల వారీగా చిన్నారులు, మృతులు
బనశంకరి: రాష్ట్రంలో మూడేళ్లలో 18,931 మంది చిన్నారులు, శిశువులు మృత్యువాత పడ్డారు. ఏడాది వయసు లోపు చిన్నారులు అకాలమరణం చెందడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. 2022–23లో 7,471 మంది శిశువులు, 2023–24లో 5,634 మంది, 2024–25లో 5,826తో కలిపి మొత్తం 18,931 మంది శిశువులు మృతి చెందారు. రాష్ట్రంలో ఇతర జిల్లాల కంటే బెంగళూరులోనే అధిక మంది చిన్నారులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. మైసూరు, రాయచూరు, బళ్లారి, బెళగావి తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఆరోగ్య నిర్వహణ సమాచార వ్యవస్థ(హెచ్‌ఎంఐఎస్)లో నమోదైన వివరాల ప్రకారం 2022లో శిశువుల మరణాలు అధికమయ్యాయి. కానీ 2023–24లో తగ్గుముఖం పట్టినప్పటికీ 2024–25లో మళ్లీ మరణాలు పెరిగాయి. ఎస్‌ఆర్‌ఎస్ నివేదిక ప్రకారం కర్ణాటకలో శిశుమరణాల ప్రమాణం ప్రతి 1000 సజీవ జననాలకు 12కు తగ్గింది. దేశంలో ఈ సరాసరి 26గా ఉంది.
ప్రభుత్వం చిన్నారుల వైద్యసేవలకు అనేక సౌకర్యాలతో కూడిన ఆరోగ్య సేవలు, సముదాయ ఆధారిత చికిత్స, ఆరోగ్య సిబ్బంది సామర్థ్య, ఇంటి ఆధారిత చిన్నారుల ఆరోగ్యసేవలు ఇతర పథకాలను అమలు చేస్తోంది. ప్రత్యేకంగా శిశు మరణాల నియంత్రణకు ప్రభుత్వంతో పాటు మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో శిశు ఆరోగ్య కేంద్రాలు (ఎస్‌ఎన్‌సీయూ) (ఎన్‌బీఎస్‌యూ)తో పాటు ఇతర ఆరోగ్య సేవలు అందిస్తోంది. అధికంగా ప్రసూతి కోసం ఎంపిక చేసిన తాలూకా ఆసుపత్రుల్లో 50 ఎస్‌ఎన్‌సీయూలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలు 24 గంటలు పని చేస్తున్నాయి. పిల్లలు వైద్యనిపుణులు, డాక్టర్లు, నర్సులతో పాటు సహాయక సిబ్బంది ఉంటారు. అవధికి ముందే జననం, బరువు తక్కువగా ఉండటంతో పాటు అస్వస్థ శిశువులకు వెంటిలేటర్ సహాయానికి ఆధునిక శ్వాసకోశ వ్యవస్థతో పాటు అవసరమైన చికిత్స సేవలు అందుబాటులో ఉంచారు. ఎస్‌ఎన్‌సీయూల్లో (కేఎంసీ) వార్డులను సైతం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 165 ఎన్‌బీఎస్‌యూ పని చేస్తున్నాయి. ప్రసూతి నిర్వహించే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సముదాయ ఆరోగ్య కేంద్రాలు, తాలూకా స్దాయి ఆసుపత్రులు, జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో 1,084 శిశు ఆరోగ్య కేంద్రాలు(ఎన్‌బీసీసీ) అందుబాటులో ఉన్నాయి. అంతేగాక తుమకూరు జిల్లా శిరా, మండ్య జిల్లా కేఆర్ పేటె, హాసన జిల్లా హొళెనరసీపుర, ఉడుపి జిల్లా కుందాపుర, బెళగావి జిల్లా గోకాక్, ఉత్తర కన్నడ జిల్లా శిరసి, కలబుర్గి జిల్లా జేవర్గి, బీదర్ జిల్లా హుమ్నాబాద్, కొప్పళ జిల్లా గంగావతి తాలూకా ఆసుపత్రుల్లో ప్రత్యేక శిశుకేంద్రాలను స్దాపించారు. ఇన్ని సౌకర్యాలు కల్పించినా చిన్నారుల మరణాల ప్రమాణం పెరుగుతూనే ఉంది.
రాష్ట్రంలో మూడేళ్లలో 18,931 మంది
చిన్నారుల మృత్యువాత
ఏడాది వయస్సు లోపు శిశు మరణాలు అధికం
శిశువుల మరణాల్లో అకాల మృతులు బెంగళూరులోనే ఎక్కువ
రాష్ట్రంలో వైద్యసౌకర్యాలు అధికం...
బెంగళూరులో 2,324, మైసూరు జిల్లాలో 1,561, రాయచూరులో 1,450, కొప్పళ 1,265, బళ్లారి 1,231, కలబుర్గి 1,062, బెళగావి 1,036, ధార్వాడ జిల్లాలో 1,023 మంది శిశుమరణాలు సంభవించాయి.