
బెంగళూరు సిటీలో కులగణన ఆరంభం
జయనగరలో వివరాలు సేకరిస్తున్న సర్వే సిబ్బంది
డీకే.శివకుమార్ నివాసంలో కులగణన చేపడుతున్న అధికారులు
బనశంకరి: రాష్ట్ర వెనుకబడినవర్గాల సామాజిక, విద్య, ఆర్థి సమీక్ష శనివారం బెంగళూరు నగరంలో ప్రారంభమైంది. సర్వే మొదటిరోజు అనేక సాంకేతిక సమస్యలు తలెత్తాయి. కొన్ని చోట్ల యాప్ పనిచేయలేదు. మరికొన్నిచోట్ల సిగ్నల్ లభించలేదు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించాలని 200 మందికిపైగా సర్వేసిబ్బంది మల్లేశ్వరం గ్రేటర్ బెంగళూరు ప్రాధికార కార్యాలయం ముందు బైఠాయించారు. సాంకేతిక సమస్యలతో సర్వే ఎలా చేయాలని ప్రశ్నించారు.
ఐదు పాలికెల్లో సర్వే
సర్వే సిబ్బంది నగరంలో 32లక్షల ఇళ్లను సందర్శించి వివరాలు నమోదు చేయనున్నారు. సర్వేకోసం సుమారు 17500 సిబ్బందిని నియమించి శిక్షణ కూడా ఇచ్చారు. వారికి గుర్తింపు కార్డులు, క్యాప్, ప్యాడ్, బుక్‌లెట్ అందించారు రెండు వారాల్లో సమీక్ష ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గ్రేటర్ బెంగళూరు చీఫ్ కమిషనర్ మహేశ్వర్‌రావు తెలిపారు. ఐదు పాలికెల్లో ఈ సర్వే సాగుతుందన్నారు. సిబ్బంది కొరతతో సర్వే ప్రారంభంలో జాప్యం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఈనెల 7న సర్వే పూర్తి కానుండగా బెంగళూరులో మాత్రం గడువు పొడిగించే అవకాశం ఉందన్నారు.
సర్వేలో ఇన్ని ప్రశ్నలా.. ఇది టూమచ్ :
డీకే శివకుమార్
బెంగళూరు నగరంలో చేపట్టిన కులగణనలో భాగంగా సర్వే సిబ్బంది సదాశివనగరలోని డీసీఎం డీకే.శివకుమార్ నివాసానికి వెళ్లారు. డీకే.శివకుమార్, ఆయన సతీమణి ఉషానుంచి సర్వే అధికారులు వివరాలు సేకరించారు. కులగణ ఓటీపీ ఏ మొబైల్‌కు వచ్చిందని ఆరా తీశారు. కొన్ని సెల్‌ఫోన్లను పరిశీలించగా ఒక ఫోన్‌లో ఓటీపీ నంబర్ లభించింది. అనంతరం ఓటీపీ తెలిపి కులగణనకు సంబంధించిన సమాచారం అందించారు. కులగణనలో సమాచారం సేకరించిన రికార్డులను డీకే శివకుమార్ గమనించి ఇన్ని ప్రశ్నలు ఉన్నాయా? నేను ఫారం చూడలేదు.. ఇన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రజలకు ఓపిక ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. ఇది చాలా టూమచ్ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశ్న సింపుల్‌గా ఉండాలన్నారు. వీటన్నింటికీ ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కోళ్లు, పశువులు, మేకలు, గొర్రెలు పెంచారా? బీమా చేశారా .. అనే ప్రశ్నలకు ప్రజలు సమాధానం చెప్పరని డీకే శివకుమార్ అన్నారు. 22 నిమిషాల్లో సర్వే పూర్తవుతుందని చెప్పిన అధికారులు.. తమ నివాసంలో గంట సమయ తీసుకున్నారని డీకే శివకుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కోళ్లు పెంచారా? చేపలు పెంచుతున్నారా? బంగారం ఎంత ఉంది అని అడగరాదని అధికారులకు సూచించారు.
32 లక్షల ఇళ్లు, రెండువారాల టార్గెట్
17వేల మంది సిబ్బంది వినియోగం
తొలిరోజే సరిగా పనిచేయని యాప్
సిగ్నల్స్ అందక సమస్యలు
ధర్నాకు దిగిన సర్వే సిబ్బంది
కులగణనలో గందరగోళం

బెంగళూరు సిటీలో కులగణన ఆరంభం