
రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణ ప్రారంభించలేదు
కోలారు: రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి ఓటరు జాబితా సవరణను ఇంతవరకు ప్రారంభించలేదు. బిహార్ తరహాలో కర్ణాటకలోను ఓటరు జాబితా సవరణ చేస్తే వాస్తవ పరిస్థితి ఏమిటో తెలుస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జీఎస్ సంగ్రేషి తెలిపారు. శనివారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు చేసిన ఓటు చోరి ఆరోపణలపై తాను స్పందించేది లేదని, ఆ విషయం తనకు తెలియదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ జాబితా ఇచ్చిన తరువాత జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేపడతామని తెలిపారు. మాలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ఫలితాల రీకౌంటింగ్‌పై స్పందిస్తూ ఆ విషయం తమ పరిధిలో లేదన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని తెలిపారు. తాము పంచాయతీ, నగర, స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలు మాత్రమే చూస్తామని తెలిపారు.
కులగణనకు వెళ్లి.. రోడ్డు
గుంతకు బలై..
దొడ్డబళ్లాపురం: కుల గణన సర్వేలో పాల్గొని ఇంటికి వెళ్తున్న టీచర్ రోడ్డు గుంతకు బలైంది. ఈ ఘటన బాగల్‌కోటె తాలూకా తిమ్మాపుర క్రాస్ వద్ద చోటుచేసుకుంది. బసవనబాగేవాడి గ్రామ నివాసి విజయకుమారి(52) రాంపుర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఈమెను కులగణనకు నియమించారు. శుక్రవారం సాయంత్రం సర్వే ముగించుకుని కుమారుడితో కలిసి బైక్‌పై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా దారి మధ్యలో బైక్ గుంతలో పడి స్కిడ్ అయ్యింది. దీంతో కిందపడి తీవ్రంగా గాయపడ్డ విజయకుమారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స ఫలించక మృతిచెందింది. బాగలకోట గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.