
ట్రంప్ పన్నుల విధింపుపై 13న సమావేశం
బళ్లారిఅర్బన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎడాపెడా ఇతర దేశాలపై పన్నులు విధించిన తీరుపై రైతు కార్మికుల సంఘం జిల్లా స్థాయి సంయుక్త సమావేశాన్ని నగరంలోని గాంధీ భవన్‌లో ఈనెల 13న ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేసినట్లు కర్ణాటక ప్రాంత రైతు సంఘం రాష్ట్రాధ్యక్షుడు యూ.బసవరాజ్ తెలిపారు. ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలపై ఆ దేశానికి ఎగుమతి చేసే వస్తువులపై 20 శాతం పన్ను, అదనంగా మరో 25 శాతం పన్ను మొత్తం కలిపి 45 శాతం పన్నులు విధించడమే కాకుండా 100 శాతం పన్ను విధిస్తానని బింకాలకు పోతున్న ట్రంప్ తీరుపై ధ్వజమెత్తారు. దీని వల్ల రూ.100కు విక్రయించే మన వస్తువుల ధర రూ.150 నుంచి రూ.200 వరకు పెరగనుంది. అలా జరిగితే ఆ వస్తువులు అమ్మడవబోవని, దీని వల్ల చిన్నతరహా వివిధ రకాల పరిశ్రమలతో పాటు రెడీమేడ్, కొర్ర చేపలు, చర్మ వస్తువులు, ఔషధాల ధరలు విపరీతంగా పెరిగి యువతకు ఉపాధి కరువయ్యే పరిస్థితులు ఏర్పడతాయని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ట్రంప్ తీరు వల్ల అభివృద్ధి చెందుతున్న ఎన్నో దేశాలు ఆర్థిక సంక్షోభానికి గురవుతాయన్నారు. సంఘం ప్రముఖులు సత్యబాబు, శివశంకర్, చెన్నబసయ్య, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.