
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
రాయచూరు రూరల్: ఎగువన భారీగా కురిిసిన వానలకు రాయచూరు జిల్లాలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. శుక్రవారం జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర వైద్యవిద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్, ఎమ్మెల్సీ వసంత్ కుమార్, ఎమ్మెల్యే హంపయ్య నాయక్ తదితరులు లింగసూగూరు, మస్కి, మాన్వి, సింధనూరు తాలూకాల్లో వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను ఆలకించారు. అక్కడక్కడా నీట మునిగిన పంటలను పరిశీలించారు. కాగా పంట నష్టపరిహారం ఎకరాకు రూ.25 వేలు చొప్పున చెల్లించాలని రైతు నేతలు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లాధికారి కార్యాలయంలో జరిగిన సమావేశంలో పంట నష్ట పరిహారం అందలేదని ఫిర్యాదులు వస్తే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత ప్రతి రైతు పొలానికి వెళ్లి సర్వే జరపాలని సూచించారు. రూ.26 కోట్ల నిధులు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. ప్రాణహానికి రూ.35 లక్షల పరిహారం కేటాయించామన్నారు. సమావేశంలో జిల్లాధికారి నితీష్, ఎస్పీ పుట్టమాదయ్య తదితరులున్నారు.