
జంబూసవారీ.. మహోజ్వలం
కన్నడనాట సాంస్కృతిక పరంపరగా భాసిల్లుతున్న, చరిత్రాత్మక నాడ హబ్బ మైసూరు దసరాలో ముఖ్యఘట్టమైన జంబూ సవారీ వేడుక నేత్రపర్వంగా జరిగింది. లక్షలాది ప్రజలు, భక్తుల మధ్య గజరాజుపై స్వర్ణ అంబారీలో నాడదేవత చాముండేశ్వరి మాత మైసూరు నగర విహారం గావించారు. శకటాలు, భేరీ నాదాలు, జానపద నృత్య వైభవం మిన్నంటింది. చూసిన కనులదే భాగ్యమనేలా అమ్మవారి యాత్ర సాగింది.
నగర వీధుల గుండా సాగుతున్న గజ యాత్ర
మైసూరు: రాచనగరి వీధుల్లో జంబూసవారీ మహోత్సవం గురువారం అత్యంత ఆర్భాటంగా జరిగింది. రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుంచీ మైసూరుకు తరలివచ్చిన లక్షలాది మంది దసరా ఉజ్వల వైభవాన్ని వీక్షించి ఆనంద పరవశులయ్యారు. ఒకవైపు గజరాజుల దళం, అశ్వాలు, డోలు వాయిద్యాల సంభ్రమం, ఆకర్షణీయమైన శకటాలు.. ఇంకా అనేక విశేషాలతో కూడిన జంబూ సవారీ అమోఘం అనే మాదిరిగా జరిగింది.
మధ్యాహ్నం నుంచి..
మధ్యాహ్నం ఒంటిగంటకు సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్, మైసూరు ఎంపీ యదువీర్, మంత్రి మహాదేవప్ప, జిల్లాధికారి లక్ష్మికాంత్‌రెడ్డి సంప్రదాయంగా నంది ధ్వజానికి పూజలు చేశారు. తరువాత జానపద కళాకారుల ఊరేగింపును ప్రారంభించారు. ఈ సమయంలో ప్యాలెస్ నుంచి నిశాని ఏనుగు ధనుంజయ ముందుకు సాగింది. గోపి, మహేంద్ర, శ్రీకంఠ, లక్ష్మి, కంజన్, భీమా, ఏకలవ్య, ప్రశాంత, సుగ్రీవ, హేమావతి ఏనుగులతో కలిసి కెప్టెన్ అభిమన్యు తరలింంది. 59 శకటాలు, 75 కళాబృందాలు ముందుకు సాగాయి.
బంగారు అంబారీలో చాముండేశ్వరి
మాత మైసూరు విహారం
నేత్రపర్వంగా మైసూరు దసరా సంభ్రమం
అంబారీ సవారీ యాత్ర ఇలా..
సాయంత్రం 4:42 గంటల నుంచి కుంభ లగ్నంలో బంగారం అంబారీలో ప్రతిష్టించిన శక్తి దేవత చాముండేశ్వరి దేవితో అభిమన్యు ఏనుగుకు సీఎం, మంత్రులు పూలు చల్లి పూజలు చేసి జంబూసవారీకి నాంది పలికారు.
గుర్రాల దళం వెంట రాగా ఏనుగులు నగర విహారానికి శ్రీకారం చుట్టాయి.
కోటె మారమ్మదేవాలయం వద్ద 21 రౌండ్లు తుపాకులు, కుశాలతోపులో ఫిరంగులు పేలాయి. నగర పోలీసు వాద్య బృందం రాష్ట్ర గీతంతో గౌరవవందనం అందించారు. ఆపై అభిమన్యు, మిగతా ఏనుగులు సంతోషంతో తొండాలు ఎత్తి ధన్యవాదాలు తెలిపాయి.
లక్షలాది ప్రజానీకం రోడ్లకు అటుఇటు ఉండి, చెట్లు, భవంతుల మీద నుంచి జంబూసవారీని తిలకించారు.
సవారీ సుమారు ఐదున్నర కిలోమీటర్ల దూరం సాగి బన్నిమంటపకు చేరింది.
అప్పుడప్పుడు జల్లులు పడ్డాయి. తోసుకువస్తున్న జనాన్ని పోలీసులు లాఠీలతో అడ్డుకున్నారు.
ప్రభుత్వ శాఖల శకటాలు అలరించాయి. అవయవదానాన్ని చాటేలా హీరో పునీత్ ప్రతిమతో ఆరోగ్యశాఖ శకటం ఆకట్టుకుంది.

జంబూసవారీ.. మహోజ్వలం