
జ్వరమని వెళ్తే ప్రాణమే బలి
వికటించిన ఆర్‌ఎంపీ వైద్యం
మాలూరు: జ్వరంతో బాధపడుతున్న బాలికకు ఆర్‌ఎంపీ చేసిన వైద్యం వికటించి మృత్యువాత పడింది. కోలారు జిల్లా మాలూరు తాలూకా రాజేనహళ్లి గ్రామ పంచాయతీ దొడ్డిగ్గలూరు గ్రామానికి చెందిన తానవి (8) మృతురాలు. బాలిక తల్లిదండ్రులు మాలూరు ఠాణాలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. బాలికకు జ్వరం రాగా సంతెహళ్లిలోని ఓ ఆర్‌ఎంపీ కి చూపించారు. అతడు ఇంజెక్షన్ ఇచ్చి, కొన్ని మందులు రాసిచ్చాడు. సూది వేసిన చోట రక్తం గడ్డ కట్టి కందిపోయింది. బాలిక విపరీతమైన నొప్పితో రెండు రోజులు బాధ పడింది. బాలిక ఆరోగ్యం దిగజారిపోడాన్ని గమనించిన పోషకులు మాలూరు పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స ఫలించక బాలిక గురువారంనాడు మరణించింది. నకిలీ వైద్యుడే కారణమని తెలిపారు. కాగా, సదరు ఆర్‌ఎంపీ పరారీలో ఉన్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఐదేళ్లూ కుర్చీలో ఉంటా: సీఎం
మైసూరు: ఐదేళ్లు నేనే సీఎం, ఇందులో రెండవ మాట లేదు, వచ్చే ఏడాది కూడా నేనే మైసూరు శక్తిదేవత చాముండేశ్వరి అంబారీకి ముఖ్యమంత్రిగా పుష్పాభిషేకం చేస్తాను అని సీఎం సిద్దరామయ్య చెప్పారు. మైసూరు దసరా వేడుకల్లో పాల్గొని మీడియాతో మాట్లాడారు. నవంబర్‌లో విప్లవం వస్తుంది, తన పదవి పోతుందని బీజేపీ నాయకులు చెప్పేది నిజం కాదన్నారు. ఐదు సంవత్సరాలూ పదవిలో ఉంటాను, హైకమాండ్ చెప్పే మాటకు అందరూ కట్టుబడి ఉండాలని అన్నారు.
హైకమాండే శిరోధార్యం
● త్వరలో 700 పదవుల పంపిణీ: డీసీఎం
శివాజీనగర: హైకమాండ్ ఏమి చెబుతుందో దానిని పాటిస్తామని సీఎం సిద్దరామయ్య చెప్పారని డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. కేపీసీసీ ఆఫీసులో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని ఆచరించి మాట్లాడారు. ఆరోపణలు మాసిపోతాయి, పనులు మిగులుతాయి. చాలా విషయాలు మాట్లాడాలి. దసరా అయిపోగానే మాట్లాడుతానని, ఎక్కడ శ్రమ ఉందో అక్కడ ఫలితం ఉందని డీకే వేదాంతం వల్లించారు. సుమారు 600–700 బోర్డులు, కార్పొరేషన్‌ల డైరెక్టర్ల పదవుల జాబితా సిద్ధమైంది, నేను– సీఎం మాట్లాడి రెండు మూడురోజుల్లో ప్రకటిస్తామన్నారు. వారు రెండేళ్లయిన తరువాత రాజీనామా చేయాలి. మేమందరం అధికారాన్ని పంచుకోవాల్సి ఉంటుంది అని చెప్పడం విశేషం. తమ గ్యారంటీలను బీజేపీ వారు కాపీ కొట్టారని హేళన చేశారు.
కుర్చీ గురించి మాట్లాడితే నోటీసు
సీఎం కుర్చీ పంపిణీ గురించి నేను మాట్లాడలేదు. దీని మీద చర్చించాల్సిన పని లేదు అన్నారు. శివరామేగౌడ, రంగనాథ్ మాత్రమే కాదు, అధికార పంపిణీ గురించి ఎవరు మాట్లాడినా పార్టీ నుంచి నోటీస్ వస్తుందన్నారు.
శిరాడిఘాట్‌లో ట్రాఫిక్ జామ్
దొడ్డబళ్లాపురం: దసరా వరుస సెలవులు రావడంతో రాష్ట్రంలో పుణ్యక్షేత్రాలు, పర్యాటక స్థలాలు జనంతో కిటకిటలాడాయి. వేలాదిగా కార్లు, మినీ బస్సుల్లో యాత్రలు కట్టారు. ఇక సెలవులు ముగియడంతో శుక్రవారంనాడు తిరుగు ప్రయాణమయ్యారు. తెల్లవారుజాము నుండే హాసన్ జిల్లాలో సకలేశపుర వద్ద శిరాఢి ఘాట్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వేల సంఖ్యలో వాహనాలు మంగళూరు, ఉడుపి, ధర్మస్థల తదితర ప్రదేశాల నుంచి బెంగళూరుకు వస్తుండడంతో కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయాయి. ప్రయాణికులు గంటల కొద్దీ రోడ్లపై చిక్కుకుపోయారు. రద్దీ నివారణకు స్థానిక పోలీసులు అష్టకష్టాలు పడ్డారు.