నీట్‌కు జిల్లాలో 20 కేంద్రాలు
జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా
గుంటూరు వెస్ట్: జిల్లాలో 20 కేంద్రాల్లో నీట్ నిర్వహణకు ఏర్పాట్లు చేశాసామని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మే 3న నిర్వహించే నీట్‌కు జిల్లాలో గుంటూరు, తెనాలి, మంగళగిరి, అమరావతిలలో 20 కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. 1650 మంది వరకు పరీక్షకు హాజరు అవుతున్నారని తెలిపారు. ఢిల్లీ నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్ష నిర్వహణకు చేసిన ఏర్పాట్లపై సమీక్షించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి, నీట్ కన్వీనర్‌లు పాల్గొన్నారు.
తప్పులు లేని మ్యుటేషన్ లక్ష్యం
తప్పులు లేని మ్యుటేషన్ లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ అధికారులతో శం గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మ్యుటేషన్ ఒకటికి రెండు సార్లు పరిశీలించి నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలన్నారు. రెవెన్యూ శాఖకు ప్రాథమిక విధి ఇదనే అంశాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. ఏ తప్పు దొర్లినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ 8 వేల పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. పుస్తకాలు ముద్రణలో ఉన్నాయని, పంపిణీకి సిద్ధం చేయాలని ఆదేశించారు. 35 గ్రామాల్లో నాలుగవ దశ రీ సర్వే జరుగుతోందని తెలిపారు. సమావేశంలో డీఆర్వో షేఖ్ ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్‌లు గంగరాజు, లక్ష్మీకుమారి, తహసీల్దార్లు పాల్గొన్నారు.
జనాభా లెక్కల సేకరణలో ముందంజలో ఉండాలి
జనాభా లెక్కల సేకరణలో ముందంజలో ఉందామని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. జనాభా లెక్కల సేకరణ – 2027 – ఇళ్ల జాబితా తయారీ, కుటుంబ జనాభా గణన అంశంపై జిల్లా, మున్సిపల్ కార్పొరేషన్, మండల స్థాయి అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో గురువారం ముగిసింది. కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమంలో అవగాహన పొందిన పరిజ్ఞానంతో మంచి డేటా సేకరణ చేయాలన్నారు. జనాభా లెక్కల సేకరణకు ఒక ప్రత్యేకత ఉందని మొట్టమొదటి సారిగా డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ప్రతీ ఒక్కరూ అంకితభావంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు.


