అత్యవసర వైద్య సేవల కోసం మొబైల్ యాప్
●కార్డియాలజిస్ట్ డాక్టర్ గొట్టిపాటి నాగార్జున
●ఘనంగా శ్రేష్ట హాస్పటల్స్ రెండో వార్షికోత్సవం
గుంటూరు మెడికల్: రోగులకు అత్యవసర సమయంలో వైద్య సహాయం వెంటనే అందేలా ఎమర్జెన్సీ ఎస్‌ఓఎస్ సౌకర్యంతో రోగుల కోసం మొబైల్ యాప్ తీసుకొస్తున్నామని శ్రేష్ట హాస్పటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గొట్టిపాటి నాగార్జున చెప్పారు. బుధవారం గుంటూరు గుజ్జనగుండ్లలోని శ్రేష్ట హాస్పటల్స్ ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా డాక్టర్ గొట్టిపాటి నాగార్జున మాట్లాడుతూ రెండేళ్లుగా రోగుల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, ఆధునిక అత్యుత్తమ వైద్యాన్ని ప్రజలకు అందిస్తూ వారి నమ్మకాన్ని సొంతం చేసుకున్నామని చెప్పారు. హాస్పటల్ ఫౌండర్, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ యడ్లపల్లి లక్ష్మణస్వామి సమాజానికి అవసరమైన మంచి వైద్యాన్ని అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా శ్రేష్ట హాస్పటల్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలకు ఫస్ట్ ఎయిడ్ కిట్‌లు అందజేశారు. ప్రజలందరికీ ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా ఆరోగ్య అవగాహన పోస్టర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


