బాలికపై లైంగిక దాడి కేసులో 20 ఏళ్లు జైలు
గుంటూరు లీగల్: బాలికను మోసగించి, బలవంతంగా పెళ్లి చేసుకుని, లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.49 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పోలకంపాడు గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన ఆరోగ్యస్వామి అజయ్ లైంగిక దాడి, వేధింపులు, బెదిరింపులు, బాల్య వివాహానికి పాల్పడ్డాడు. అజయ్ 2021 సంవత్సరంలో మార్చి 24న కనకదుర్గమ్మ ఆలయానికి బాలికను తీసుకెళ్లి బలవంతంగా ఆమె మెడలో తాళి కట్టాడు. అనంతరం బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత బాలిక భయంతో మౌనంగా ఉంటూ, ఒంటరిగా ఉండటం చూసిన తల్లిదండ్రులు ఆమెను నిలదీసి అడగగా జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో 2021 జూన్ 2న పోలీలసుకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి కేసును లోతుగా దర్యాప్తు జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. కేసు పూర్వ పరాలను పరిశీలించిన న్యాయమూర్తి మహమ్మద్ పర్వీన్ సుల్తానా బేగం నిందితుడి ప్రతివాదనలు విన్న తరువాత దోషిగా గుర్తించి తీర్పు చెప్పారు. బాధితురాలు తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. దర్యాప్తు అధికారి కె.రవికుమార్, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ ప్రభాకర్, కానిస్టేబుల్ ఎం.ఖాజామొహిద్దిన్, హెడ్‌కానిస్టేబుల్ ప్రకాష్ తదితరులు కేసు దర్యాప్తులో కృషి చేశారు.
విద్యార్థిని ఆత్మహత్య కేసులో పురోగతి
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణం పోలకంపాడులో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని మరో విద్యార్థి అసభ్య వీడియోలు చూపించి బెదిరించిన సంఘటనలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసిన తాడేపల్లి ఎస్‌ఐ వెంకటసాయి విద్యార్థిని మృతికి కారణమైన డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రహీమ్‌ను మంగళవారం అరెస్ట్‌చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ వెంకట సాయి మాట్లాడుతూ కేసు నమోదు చేసిన అనంతరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, డిఎస్పీ మురళీకృష్ణ, ఆదేశాల మేరకు తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు దర్యాప్తు చేపట్టారన్నారు. యర్రబాలెంలోని మంచాల హోటల్ వద్ద సంచరిస్తున్న విద్యార్థి రహీమ్‌ను అదుపులోకి తీసుకుని విచారించి కోర్టుకు హాజరుపరిచామన్నారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిందని తెలిపారు. అనంతరం రహీమ్‌ను జిల్లా సబ్‌జైలుకు తరలించినట్లు వివరించారు.
పోలీసుల అదుపులో బెట్టింగ్ రాయుళ్లు
తాడేపల్లి రూరల్ : ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని గుంటూరు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించి పెనుమాకకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని మంగళవారం తాడేపల్లి పోలీసులకు అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. పెనుమాకకు చెందిన ఆ వ్యక్తితోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. దీనిపై కొంతమంది రాజకీయ నాయకులు కేసులు లేకుండా పోలీసులతో రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియవచ్చింది.
బాలికపై లైంగిక దాడి కేసులో 20 ఏళ్లు జైలు


