ఐసీఏఐ గుంటూరు శాఖ కార్యవర్గ ప్రమాణ స్వీకారం
గుంటూరు ఎడ్యుకేషన్ : ఇనిస్టిట్యూట్ అఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అఫ్ ఇండియా (ఐసీఏఐ) గుంటూరు శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మంగళవారం అమరావతిరోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీఏఐ గుంటూరు శాఖ చైర్మన్‌గా రుద్రవరపు భరద్వాజ్, వైస్ చైర్మన్‌గా వనిమిరెడ్డి వెంకట నరేష్, కార్యదర్శిగా కన్నెగంటి మృత్యుంజయరావు, కోశాధికారిగా నాగబీరు రాజశేఖర్, సికాసా చైర్మన్‌గా షేక్ బాజీతో పాటు కమిటీ సభ్యులు దేసు సంపత్, చింతా రఘు నందన్ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో దక్షిణ భారత చాప్టర్ చైర్మన్ ముప్పాళ్ల సుబ్బారావు, ఐసీఏఐ, ఎస్‌ఐఆర్‌సీ ప్రతినిధులు డి.ప్రసన్నకుమార్, మండవ సునీల్ కుమార్, దీపక్ లడ్డా, ఎర్ర తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు మెడికల్: గుంటూరు మెడికల్ కాలేజీలో జరుగుతున్న మెడికల్ ఎగ్జిబిషన్‌లో రేడియాలజీ విభాగం ఏర్పాటు చేసిన ప్రదర్శనలు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆధునిక వైద్య రంగంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న సీటీ స్కాన్, ఎమ్మారై స్కాన్, పీఈటీ–సీటీ వంటి చిత్రీకరణ పద్ధతుల గురించి విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరించారు. రేడియాలజీ విభాగం వైద్యులు, వైద్య విద్యార్థులు కలిసి ఎగ్జిబిషన్‌ను తిలకించేందుకు వచ్చిన పాఠశాల విద్యార్థులకు యంత్రం ఎలా పనిచేస్తుందో, శరీరంలో బయటికి కనిపించని సమస్యలను ఎలా గుర్తిస్తారో సులభంగా అర్థమయ్యేలా వివరించారు. విద్యార్థులు ఆసక్తిగా వింటూ పలు ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రత్యేకంగా సీటీ స్కాన్ ద్వారా ఎముక విరుగుడు, మెదడు గాయాలు, ఊపిరితిత్తుల సమస్యలు వంటి వ్యాధులను ఎలా గుర్తిస్తారో ప్రత్యక్ష చిత్రాలతో చూపించారు. ఆధునిక సాంకేతికత వైద్య నిర్ధారణలో ఎంత ముఖ్యమో విద్యార్థులు అవగాహన కల్పించారు. గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి రేడియాలజీ విభాగం ప్రదర్శనలను పరిశీలించి, విజ్ఞానాన్ని ప్రజలకు సులభంగా అందించే విధంగా ఏర్పాటు చేసినందుకు అభినందించారు.
తాడికొండ: తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న నామి ఐలాండ్, సియోల్ జాతీయ యూనివర్సిటీ(దక్షిణ కొరియా) బృందం సోమవారం రాజధాని అమరావతిలో పర్యటించింది. పర్యటనలో భాగంగా రాయపూడిలోని సీఆర్డీయే కార్యాలయాన్ని బృందం సందర్శించింది. ఈ సందర్భంగా అమరావతి అభివృద్ధి గురించి సీఆర్డీయే అధికారులు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం సీఆర్డీయే కమిషనర్ కె.కన్నబాబుతో బృందం భేటీ అయ్యింది. రాజధాని అమరావతి ప్రాంత సాంస్కృతిక ప్రత్యేకతలను ప్రతిబింబించే వివిధ వస్తువులు కలిగిన గిఫ్ట్ బ్యాగ్‌ను కమిషనర్ బృందంలోని సభ్యులకు అందజేశారు. అమరావతిలో పర్యాటక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలను కమిషనర్ చర్చించారు. దక్షిణ కొరియా బృందంలో నామి ఐలాండ్ (విద్య – కళలు విభాగం) బృందంలోని సభ్యలు సీఈఓ కయాంగ్ వూ మిన్ సీనియర్ ప్రొడ్యూసర్ జిన్‌వూక్ వోన్, కల్చరల్ ప్రాజెక్టు విభాగం ప్రొడ్యూసర్ జాలాది చిరాగ్ శేషు, సియోల్ జాతీయ యూనివర్సిటీ (ఆసియా సెంటర్) బృందంలోని సభ్యులు డైరెక్టర్ సెంటర్ ఫర్ సౌత్ ఏషియన్ స్టడీస్ సంగ్ యాంగ్ కాంగ్, సౌత్ ఏషియన్ స్టడీస్ సెంటర్ సీనియర్ రీసెర్చర్ సియాంగో చోయ్ తదితరులు పాల్గొన్నారు.
ఐసీఏఐ గుంటూరు శాఖ కార్యవర్గ ప్రమాణ స్వీకారం
ఐసీఏఐ గుంటూరు శాఖ కార్యవర్గ ప్రమాణ స్వీకారం
ఐసీఏఐ గుంటూరు శాఖ కార్యవర్గ ప్రమాణ స్వీకారం


