చోరీ కేసులో ఆరుగురు అరెస్టు
ఈనెల 16న పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర తల్లి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన దుండగులు సుమారు రూ.69.25 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు సీజ్
నగరంపాలెం: ఎమ్మెల్యే తల్లి ఇంట్లో చోరీకి పాల్పడిన వారిలో ఆరుగురిని అరెస్ట్ చేసి, సుమారు రూ.69.25 లక్షల ఖరీదైన బంగారం/ వెండి వస్తువులు, రూ.లక్ష నగదు, కారు, మోటారుసైకిల్‌ను పొన్నూరు గ్రామీణ పీఎస్ పోలీసులు సీజ్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ధూళిపాళ్ల ప్రమీలాదేవి చింతలపూడి గ్రామంలో నివసించేది. గత మూడు వారాలుగా ఆమె గుంటూరులోని కుమారుని ఇంట్లో ఉంటోంది. ఈనెల 16న తాళం వేసిన ఇంట్లోకి చొరబడిన దొంగలు బీరువా తాళం పగులకొట్టి 42 సవర్ల బంగారం, 10.5 కిలోల వెండి, రూ.లక్ష నగదు దొంగలించారు. దీనిపై ప్రమీలాదేవి పొన్నూరు రూరల్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్‌ఐ శ్రీహరి కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పొన్నూరు రూరల్ పీఎస్ సీఐ పి.కృష్ణయ్య ఇంటి పరిసరాల్లోని సీసీ కెమెరాలు పరిశీలించారు. వేలిముద్రల ఆధారాల మేరకు కారులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆరుగుర్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఏలూరు జిల్లా పడపాడు వాసి సత్తెనపల్లి రాకేష్, ప్రకాశం జిల్లా కొత్తపట్నం ఈతముక్కలపాలెం గ్రామవాసి కె.ఆశ్వీరాదం, ఏలూరు కండ్రిపాడుకి చెందిన జేడీ కుమార్, ఏలూరు మొండికొడు గ్రామ వాసి నక్క దుర్గప్రసాద్, ఏలూరు చాటపర్రుకి చెందిన జి.రఘు, దగ్గుమల్లి చినబాబు, పి.కృపసామ్యేలను గుర్తించారు. వీరంతా రాత్రిళ్లు తాళాలు వేసిన ఇళ్లల్లో ఖరీదైన వస్తువులను దొంగిలించి, విక్రయించిన సొమ్ముతో జల్సాలు చేసే వారని గుర్తించారు. దీంతో ఆరుగుర్ని అరెస్ట్ చేయగా, చిన్నబాబు, పి.కృపసామ్యేల్‌ను త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.
చోరీ చేసిన కారులోనే చోరీకొచ్చారు..
35 ఏళ్ల సత్తెనపల్లి రాకేష్‌పై పలు జిల్లాల్లో 34 చోరీ కేసులున్నాయి. అతనికి ప్రకాశం జిల్లాకు చెందిన విక్కీ ద్వారా ఆశీర్వాదం పరిచయమయ్యారు. వీరిద్దరు తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఈనెల 16న చింతలపూడి గ్రామంలో రాకేష్, ఆశిష్, ఆశీర్వాదం రెక్కీ చేశారు. చీరాలలో దొంగలించిన కారులో వచ్చి, అర్థరాత్రి 1.30 నుంచి 2.30 మధ్యలో చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.69.25 లక్షల ఖరీదైన 42 సవర్ల బంగారం, కరిగించిన వెండి వస్తువులు, రూ.లక్ష నగదు, కారు, మోటారుసైకిల్‌ను సీజ్ చేశారు. ఏడు రోజుల్లో కేసుని చేధించిన తెనాలి డీఎస్పీ జనార్ధన్‌రావు, పొన్నూరు రూరల్ పీఎస్ సీఐ కృష్ణయ్య, ఎస్‌ఐలు శ్రీహరి (పొన్నూరు రూరల్ పీఎస్), ఎస్‌ఐ వీరనారాయణ (చేబ్రోలు పీఎస్), ఏఎస్‌ఐ శ్రీనివాసరావు, హెచ్‌సీ నరేష్, కానిస్టేబుళ్లు రవి, శివయ్య, సుధీర్, గోవిందరాజు, హోంగార్డు రాజేష్‌లను జిల్లా ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందించారు.


