మోసగించిన వారికి జైలుశిక్ష | - | Sakshi
Sakshi News home page

మోసగించిన వారికి జైలుశిక్ష

Feb 24 2026 7:23 AM | Updated on Feb 24 2026 7:23 AM

మోసగించిన వారికి జైలుశిక్ష

మోసగించిన వారికి జైలుశిక్ష

తాడేపల్లి రూరల్‌: ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన ముగ్గురు నిందితులకు మంగళగిరి న్యాయస్థానం జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది. మంగళగిరి ఏజేసీజే కోర్టు న్యాయమూర్తి ఎం. ప్రసన్నలక్ష్మి సోమవారం తీర్పు వెలువరించారు. వివరాల ప్రకారం... తాడేపల్లి పట్టణానికి చెందిన దొంతిరెడ్డి అనుదీప్‌రెడ్డి గుంటూరు మున్సిపల్‌ కార్యాలయంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో జమ్మిలిదిన్నె బసిరెడ్డి, దేవిరెడ్డి తిరుపతి రెడ్డి, జమ్మిలిదిన్నె ప్రవళికలు కస్టమ్స్‌ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి రూ.40 లక్షలు తీసుకుని పరారయ్యారు. దీనిపై తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో బాధితుడు 2019 ఆగష్టు 2వ తేదీన ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్‌ఐ ఆర్‌ నారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చీటింగ్‌ కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు దర్యాప్తు నివేదికను న్యాయస్థానానికి అందించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి.. నిందితులకు మూడు సంవత్సరాల జైలుశిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధించారు. ఈ కేసులో ప్రభుత్వ న్యాయవాదిగా కె. శివలీల వ్యవహరించారు.

విజిలెన్స్‌ దాడుల్లో భారీగా సిగరెట్లు పట్టివేత

సత్తెనపల్లి: అనుమతులకు విరుద్ధంగా బిల్లులు లేకుండా సిగరెట్లు గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారని అందిన సమాచారం మేరకు గుంటూరు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి ఇ.సూర్య శ్రవణ్‌ కుమార్‌ ఆదేశాల మేరకు విజిలెన్స్‌ బృందం, సత్తెనపల్లి రెవెన్యూ అధికారులతో కలిసి సోమవారం దాడులు నిర్వహించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వడ్డవల్లి ఆంజనేయ స్వామి దేవాలయం వెనుక బజార్‌లో 15వ వార్డుకు చెందిన నోముల కోటేశ్వరరావు గృహంలో సోమవారం అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో బిల్లులు లేకుండా అనధికారికంగా సిగరెట్లను నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు తేలింది. ఈ సిగరెట్లపై చిత్రపరమైన ఆరోగ్య హెచ్చరిక లేకపోవడం, ఎటువంటి చెల్లుబాటు అయ్యే అనుమతులు లేకపోవడాన్ని గుర్తించారు. నోముల కోటేశ్వరరావును విజిలెన్స్‌ అధికారులు ప్రశ్నించగా పట్టణంలో నివసించే ఉయ్యూరు సుబ్బారావు గుప్తా నుంచి ఈ సిగరెట్లను కొనుగోలు చేస్తున్నట్లు అంగీ కరించారు. మొత్తం రూ. 3,31,060 విలువైన మొత్తం ఆరు రకాల అనధికార విమల్‌, బ్లాక్‌, గోల్డ్‌ విమల్‌, విమల్‌, గోల్డ్‌శాండ్‌, పలాస్‌ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. నోముల కోటేశ్వరరావు, ఉయ్యూరు సుబ్బారావు గుప్తాపై సత్తెనపల్లి టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదు చేయబడుతుందన్నారు. తనిఖీలలో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.చంద్రశేఖర్‌, అసిస్టెంట్‌ జియాలజిస్ట్‌ అనిల్‌బాబు, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అమీర్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

రైలు కింద పడి మహిళ బలవన్మరణం

గురజాల: రైలు కింద పడి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... గురజాలలో నివాసం ఉంటున్న వీరిశెట్టి వైష్ణవి (39) స్థానికంగా ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంటుంది. భర్త కిషోర్‌ లెక్చరర్‌గా పనిచేస్తాడు. ఈక్రమంలో తెల్లవారు జామున మాచర్ల నుంచి గుంటూరు వెళ్లే ప్యాసింజర్‌ రైలు కింద పడి వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనలో వైష్ణవి కొన ఊపిరితో ఉండటంతో స్థానికులు 108 సహాయంతో గురజాలలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యశాలలో వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు తెలిపారు. మృతురాలికి భర్త, ఏడు సంవత్సరాల కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉంచారు. రైల్వే పోలీసులు సమాచారం సేకరించి విచారణ చేపడుతున్నారు.

వైద్యశాల ఎదుట బంధువుల ఆందోళన..

సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద వైష్ణవి బంధువులు ఆందోళన చేపట్టారు. వైష్ణవి మృతికి భర్త కిషోర్‌ కారణమని కిషోర్‌ వైష్ణవిని ఎప్పుడు కట్నం కోసం వేధిస్తుండేవాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. వైష్ణవిని పక్కంటి ఆడవాళ్లతో మాట్లాడినా అనుమానించి, అవమానించేవాడని.. గత కొంత కాలంగా చిత్రహింసలు పెడుతూ ఇబ్బందులకు గురిచేసేవాడని ఆరోపించారు. భర్త వేధింపులు తాళలేకనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. వైద్యశాల వద్ద వైష్ణవి కుమారుడు విలపించిన తీరు పలువురిచే కంట తడి పెట్టించింది.

చలో విజయవాడ విజయవంతం చేయాలి

చిలకలూరిపేట: ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఈ నెల 25న నిర్వహిస్తున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు, రాష్ట్ర డైరీ కమిటీ కన్వీనర్‌ పి.శ్రీనివాసరావు పిలుపు నిచ్చారు. ఎస్టీయూ ఆధ్వర్యంలో చలో విజయవాడ (సమరశంఖం) పోస్టర్‌ను పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఐక్య పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం మౌనం వహిస్తే సహించేది లేదని, ఇది హక్కుల కోసం జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు 12వ పీఆర్‌సీ కమిషన్‌ ఏర్పాటు, 30 శాతం మధ్యంతర భృతి కల్పించలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement