ఏఎన్‌యూ పీజీ ప్రశ్నపత్రంలో తప్పులు | - | Sakshi
Sakshi News home page

ఏఎన్‌యూ పీజీ ప్రశ్నపత్రంలో తప్పులు

Feb 24 2026 7:23 AM | Updated on Feb 24 2026 7:23 AM

ఏఎన్‌యూ పీజీ ప్రశ్నపత్రంలో తప్పులు

ఏఎన్‌యూ పీజీ ప్రశ్నపత్రంలో తప్పులు

● మొదటి సెమిస్టర్‌ విద్యార్థులకు అవస్థలు ● పీజీ కో ఆర్డినేటర్‌ నిర్లక్ష్యమే కారణం

ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూలో పీజీ పరీక్షల నిర్వహణ అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉందని విద్యార్థులు వాపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మొదటి సెమిస్టర్‌ పరీక్షల్లో అధికారుల నిర్లక్ష్యం మరోమారు బట్టబయలైంది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. మొత్తం 19 సెంటర్లలో పరీక్షలు జరుగుతున్నాయి. తొలిరోజు బుధవారం ఆంగ్ల పరీక్ష పేపరు, సోమవారం జరిగిన బయాలజీ విభాగాల పరీక్షల ప్రశ్నపత్రాల్లో తప్పులను చూసి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తొలిరోజు తప్పులతో కూడిన ప్రశ్నపత్రం ఇస్తే సోమవారం అసలు సిలబస్‌లో లేని ప్రశ్నలు వచ్చాయని విద్యార్థులు వాపోతున్నారు. బ్యాక్టీరియాలజీ ప్రశ్నపత్రంలో 50 శాతానికిపైగా సిలబస్‌లో లేని ప్రశ్నలు రావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడినట్లు సమాచారం. నాలుగు, ఐదు యూనిట్లకు చెందిన ప్రశ్నలుగా మూడవ సెమిస్టర్‌కు చెందిన వైరాలజీ విభాగ ప్రశ్నలు వచ్చాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ పరిధిలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా మరో రెండు కళాశాలల్లో సైతం ఇదే ప్రశ్నపత్రాన్ని వర్సిటీ అధికారులు విద్యార్థులకు అందించారు. తప్పులను పరిశీలకుల నుంచి తెలుసుకున్న పీజీ కో ఆర్డినేటర్‌ మన్నం సుబ్బారావు వచ్చి విద్యార్థుల చేతులలో నుంచి తప్పుగా వచ్చిన ప్రశ్నపత్రాలను తీసుకెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది. సోమవారం జరిగిన బీఈడీ పరీక్షలో కూడా పలు సెంటర్లలో ఒక దానికి బదులుగా మరొక పేపరు ఇవ్వడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. పరీక్ష నిర్వహణ ఆలస్యంగా మారింది. మూడో సెమిస్టర్‌ పరీక్షల కూడా తప్పులతో కూడిన పశ్నపత్రాలు, ఒక ప్రశ్నపత్రంతో ఒకే ప్రశ్న మూడు సార్లు ఇవ్వడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని విద్యావేత్తలు, తల్లిదండ్రులు, విద్యార్థులు వర్సిటీ అధికారులను కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement