‘ఉద్యోగుల దుష్ర్పవర్తనపై రాజీ పడబోం’ | TCS Nashik Harassment Conversion Scandal Tata Group Enforces Zero Tolerance | Sakshi
Sakshi News home page

‘ఉద్యోగుల దుష్ర్పవర్తనపై రాజీ పడబోం’

Apr 13 2026 7:38 PM | Updated on Apr 13 2026 7:48 PM

TCS Nashik Harassment Conversion Scandal Tata Group Enforces Zero Tolerance

దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) నాసిక్ బ్రాంచ్‌లో వెలుగుచూసిన లైంగిక వేధింపులు, మతమార్పిడి ఆరోపణల కలకలంపై టాటా గ్రూప్ కఠినంగా స్పందించింది. ఉద్యోగుల దుష్ప్రవర్తన, వేధింపుల విషయంలో సంస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోదని ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తామని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ సోమవారం స్పష్టం చేశారు.

విచారణాధికారిగా సీఓఓ

ఈ వ్యవహారంపై అంతర్గతంగా విచారణ జరిపి బాధ్యులైన వారిని గుర్తించేందుకు టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) ఆర్తీ సుబ్రమణియన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ‘ఈ ఘటనలు మమ్మల్ని తీవ్రంగా కలచివేశాయి. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అవసరమైన చోట సంస్థాగత మార్పులు చేపట్టి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.

అసలేం జరిగింది?

గత మార్చి నెలలో టీసీఎస్‌లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని, పెళ్లి పేరుతో తనను శారీరకంగా లొంగదీసుకున్నారంటూ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. అయితే దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ ఇది కేవలం వ్యక్తిగత నేరం కాదని వ్యవస్థీకృత వేధింపులని తేలింది. ఎనిమిది మంది మహిళలు, ఒక పురుష ఉద్యోగి వేధింపులపై ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చారు. బాధితులను బలవంతంగా మతమార్పిడికి ప్రేరేపించడం, మాంసం తినాలని ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. దేవతలను అవహేళన చేస్తూ ఉద్యోగుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

ఏడుగురు అరెస్ట్..

నాసిక్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి అందిన నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేశారు. నిందితులను ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రజా మెమన్, తౌసిఫ్ అత్తర్, డానిష్ షేక్‌లుగా గుర్తించారు. వీరిపై లైంగిక వేధింపులు, మత విద్వేషాల ప్రేరేపణ వంటి సెక్షన్ల కింద 8 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.

హెచ్ఆర్ అధికారుల వైఫల్యంపై విచారణ

బాధితులు గతంలోనే కంపెనీకి చెందిన హెచ్ఆర్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు సరైన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం పుణెకు చెందిన టీసీఎస్ హెచ్ఆర్ అధికారిణిని పోలీసులు విచారిస్తున్నారు. ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయడం ద్వారా ఆమె నిందితులకు పరోక్షంగా సహకరించారా అనే కోణంలో నోటీసులు జారీ చేశారు.

ప్రభుత్వం సీరియస్.. సిట్‌ ఏర్పాటు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించారు. ‘ఇది సమాజంలో విద్వేషాలు నింపే అత్యంత తీవ్రమైన విషయం. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం’ అని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో లోతైన కుట్ర కోణాన్ని ఛేదించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది. నాసిక్ పోలీసులు తీసుకున్న వేగవంతమైన చర్యలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. కార్పొరేట్ రంగంలో ఉద్యోగుల భద్రత, నైతిక విలువలపై ఈ ఘటన పెద్ద చర్చకు దారితీసింది.

ఇదీ చదవండి: ఇరాన్‌ సమీపంలో అమెరికా నౌకా దళాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement