
రాణించిన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ షేర్లు
సెన్సెక్స్ 137 పాయింట్లు ప్లస్
25,100 స్థాయిపైకి నిఫ్టీ
ముంబై: అధిక వెయిటేజీ హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకుల షేర్లు 1% రాణించడంతో స్టాక్ మార్కెట్ నాలుగో రోజూ లాభపడింది. సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కలిసొచ్చాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 137 పాయింట్లు పెరిగి 81,927 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 31 పాయింట్లు బలపడి 25,108 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలపై ఆశలతో ప్రథమార్ధమంతా స్థిరంగా ముందుకు కదలాయి. ఒక దశలో సెన్సెక్స్ 519 పాయింట్లు బలపడి 82,310 వద్ద, నిఫ్టీ 143 పాయింట్లు ఎగసి 25,221 వద్ద గరిష్టాలు నమోదు చేశాయి.
అయితే ద్వితీయార్ధంలో ఎఫ్‌ఎంసీజీ, కమోడిటీస్, ఐటీ, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణతో సూచీల లాభాలు తగ్గాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ మూడు పైసలు బలహీనపడి 88.77 వద్ద స్థిరపడింది. ఆసియాలో జపాన్, సింగపూర్, తైవాన్, ఇండోనేíÙయా, కొరియా మార్కెట్లు లాభపడ్డాయి. సెలవు కారణంగా చైనా, హాంగ్‌కాంగ్ మార్కెట్లు పనిచేయలేదు. యూరప్ మార్కెట్లు అరశాతం పెరిగాయి. అమెరికా సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
⇒ బీఎస్‌ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో టెలికం 2.13%, రియల్టీ 1.09%, ఇంధన 0.50%, కన్జూమర్ డ్యూరబుల్స్ 0.28%, ఫైనాన్సియల్ సర్విసెస్ 0.24%, ఐటీ 0.23 శాతం లాభపడ్డాయి.
⇒ లాజిస్టిక్స్ సర్విసు ప్రొవైడర్ గ్లోటిస్ లిస్టింగ్ నిరాశపరిచింది. ఇష్యూ ధర(రూ.129)తో పోలిస్తే బీఎస్‌ఈలో 32% డిస్కౌంటుతో రూ.88 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 37% క్షీణించి రూ.81 కనిష్టాన్ని తాకింది. చివరికి 35% పతనంతో రూ.84 వద్ద నిలిచింది.
⇒ ఇష్యూ ధర (రూ.191) వద్దే ఫ్లాటుగా లిస్టయిన ఫ్యాబ్‌టెక్ టెక్నాలజీస్ షేరూ మెప్పించలేకపోయింది. ఇంట్రాడేలో 5% పతనమై రూ.181 వద్ద కనిష్టాన్ని తాకింది. మార్కెట్ ముగిసే సరికి 4.5% నష్టంతో రూ.182 వద్ద స్థిరపడింది.