లంచం తీసుకుని బ్లాక్ లిస్టులోని పట్టాదారు పాస్ పుస్తకాల అందజేత కోర్టులో కేసులున్నా జేబులు నింపుకొనేందుకు అడ్డదారులు
వీఆర్వోల హవా
చుండూరు (వేమూరు): ముడుపులు చెల్లిస్తే బ్లాక్ లిస్టులో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేసిన అధికారుల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. కోర్టు వివాదంలో ఉన్న పొలాలకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు బ్లాక్ లిస్టులో ఉన్నాయి. రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకొని ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేశారు. చుండూరు మండలంలోని చినపరిమి గ్రామంలో అనంతగిరి ముసలయ్యకు 56 సెంట్లు మాగాణి సాగు భూమి ఉంది. ఆయనకు ఆరుగురు కుమారులు, కుమార్తె సంతానం. కుమార్తెకు మాటలు రావు. ఆ భూమిని కుమార్తె పేరిట వీలునామా రాశారు. ఆమె అనంతరం కుమారులకు హక్కులు కల్పించారు. ఐదుగురు అన్నదమ్ముల్లో ఒక తమ్ముడు కొడుకు అనంతం శ్రీనివాసరావు రెవెన్యూ అధికారులకు డబ్బులు ఇచ్చి 2020 పట్టాదారు పాస్ పుస్తకాలు పొందాడు. హక్కుదారులైన మగిలిన అన్నదమ్ములు చుండూరు తహసీల్దారు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులు పట్టాదారు పాస్ పుస్తకం బ్లాక్ లిస్టులో పెట్టారు. అనంత శ్రీనివాసరావు తెనాలి సివిల్ కోర్టును ఆశ్రయించాడు. శ్రీనివాసరావు నకిలీ పత్రాలు ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందాడని మిగతావారు చుండూరు పోలీసు స్టేషన్‌ను ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా ఆధారాలను పరిశీలించిన అనంతరం శ్రీనివాసరావుపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కోర్టులో కేసులు కొనసాగుతున్నాయి. 2026లో చుండూరు తహసీల్దారు నాగరాజు లంచం తీసుకొని బ్లాక్‌లో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకం శ్రీనివాసరావుకు ఇచ్చారు. హక్కుదారులు మార్చి 30వ తేదీన దీనిపై జిల్లా కలెక్టరుకు అర్జీ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ నెల 4వ తేదీన చుండూరు తహసీల్దారును కలిశారు. కోర్టు వివాదంలో ఉన్న పొలాలకు పట్టాదారు పాస్ పుస్తకం ఎందుకు మంజూరు చేశారని అడిగారు. తహసీల్దారు కార్యాలయంలోని వీఆర్వోలు కోర్టు వివాదంలో ఉన్న చినగాదెలవర్రు, పెదగాదెలవర్రు గ్రామాలకు చెందిన పొలాలకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేశారని బాధితులు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చుండూరు మండలంలోని కొంతమంది వీఆర్వోల హవా కొనసాగుతోంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కొంత మంది వీఆర్వోలను బదిలీ కావడం లేదు. కొంతమంది రైతుల వద్ద డబ్బులు తీసుకొని నకిలీ దస్తావేజులు పుట్టిస్తున్నారు. వాటి ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వీఆర్వోలు అంటే తహసీల్దారు కూడా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.


