అమృతలూరు(భట్టిప్రోలు): అమృత లూరు మండలం గోవాడలో వేం చేసియున్న గంగా పార్వతి సమేత బాలకోటేశ్వర స్వామి దేవస్థానం నిర్మితమై శత వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు మహా కుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహణాధికారి ఎంవీఎస్ వర్మ ఆదివారం ఒక ప్రకనలో పేర్కొన్నారు. ఆలయ ముఖ్య అర్చకులు చావలి శ్రీధర్‌శర్మ, ఐలూరి సుబ్రహ్మణ్య దీక్షులచే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 16న ప్రవచన విద్వాంసురాలు అనుగ్రహభాషణ, 17న వేదాంతం సునీత భాషణం, 18న మాతా శివానంద సరస్వతి (శివకేశవ పీఠాధిపతులు) అనుగ్రహ భాషణం, సాయంత్రం గ్రామోత్సవం, 19న పెనుగొండ క్షేత్ర పీఠాథిపతి పజ్ఞానంద సరస్వతి బాల స్వామి అనుగ్రహ భాషణం, సాయంత్రం ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త నోరి నారాయణమూర్తి ప్రవచనం, 20న మహా కుంభాభిషేకం, మధ్యాహ్నం అన్న సంతర్పణ జరుగుతుందని వివరించారు.
డీఈఓ రామారావు
నరసరావుపేట ఈస్ట్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకనం ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతోందని జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు తెలిపారు. కేబీఆర్ కళాశాల ప్రాంగణంలోని పది మూల్యాంకన కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించి మూల్యాంకనం కొనసాగుతున్న తీరును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మూల్యాంకన కేంద్రానికి 1,75,700 పేపర్లు వచ్చాయని తెలిపారు. ఇప్పటి వరకు 60 శాతం మూల్యాంకనం పూర్తయినట్టు వివరించారు. ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా, ప్రతి గదిలోనూ ఫ్యాన్, లైట్లు ఏర్పాటు చేశామన్నారు. తాగునీరు, వైద్యసేవలకు సిబ్బందిని అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి ఖమ్మం జిల్లాకు చెందిన భక్తులు ఆదివారం రూ.1.28 లక్షల విరాళాన్ని అందజేశారు. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన జయలక్ష్మి, వంశీకృష్ణ కుటుంబం ఆదివారం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసిన వారు అమ్మవారి నిత్యాన్నదానానికి రూ.1.28,166 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.


