ఓఆర్‌ఆర్‌ మలుపులపై రైతుల నిరసన | - | Sakshi
Sakshi News home page

ఓఆర్‌ఆర్‌ మలుపులపై రైతుల నిరసన

Apr 13 2026 7:56 AM | Updated on Apr 13 2026 7:56 AM

ఓఆర్‌ఆర్‌ మలుపులపై రైతుల నిరసన

గుంటూరు రూరల్‌: ఔటర్‌ రింగ్‌ రోడ్డు 2017లో తొలిసారిగా ఇచ్చిన ఎలైన్‌మెంట్‌ను తుంగలో తొక్కి 2025లో ఇష్టం వచ్చినట్లు మలుపులు తిప్పుతూ మరోసారి ఎలైన్‌మెంట్‌ మార్చిన ప్రభుత్వం తీరుపై వట్టిచెరుకూరు మండలం రైతులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలో రైతులు ప్రస్తుతం ఔట్‌ రింగ్‌ రోడ్డు వెళుతున్న మార్గంలో పొలాల వద్ద బైటాయించి నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని ఇంజనంపాడు చమళ్ళమూడి, కుర్నూతల పుల్లడిగుంట గ్రామాల మీదుగా వెళుతున్న అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం మలుపు తిరగడంతో రైతులంతా ఆందోళన చెందుతున్నారని వారు పేర్కొన్నారు. 2017 అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు కోసం చేసిన ఎలైన్‌మెంట్‌ సజావుగా ఉందని, 2025–26 మ్యాప్‌ ఎలైన్‌మెంట్‌ కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. చైన్నె, బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో లేని వెడల్పాటి 140 మీటర్ల రోడ్లు తమకొద్దని, 70 మీటర్ల రోడ్డు నిర్మాణం చాలని రైతులు తెలిపారు. రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల భూములకు ఇప్పుడు ఇస్తున్న పరిహారం సరిపోదని, సరైన పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గ్రామ సభలు నిర్వహించి బాధిత రైతుల డిమాండ్లను తెలుసుకుని, వాటిని అమలు చేయాలని కోరారు. లేని పరిస్థితుల్లో ధర్నా, రాస్తారోకోలు నిర్వహిస్తామని చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్లు మలుపులు తిప్పి రైతులను ఇబ్బందులకు గురిచేయటమే ఈ ఎలైన్‌మెంట్‌ లక్ష్యంగా ఉందన్నారు. ఈ మార్పుల వల్ల చమల్ళమూడి, కుర్నూతల పరిధిలోని రైతులకు ప్రస్తుత బహిరంగ మార్కెట్‌తో ప్రభుత్వం ఇచ్చే పరిహారానికి కనీసం పొంతన లేదని వాపోయారు. పాత ఎలైన్‌మెంట్‌ను పరిగణనలోకి తీసుకుని రోడ్డు నిర్మాణం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement