అధికారం ఉందని అహంకారంతో మాట్లాడకు.. | - | Sakshi
Sakshi News home page

అధికారం ఉందని అహంకారంతో మాట్లాడకు..

Apr 13 2026 7:56 AM | Updated on Apr 13 2026 7:56 AM

అధికారం ఉందని అహంకారంతో మాట్లాడకు..

ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌పై వైఎస్సార్‌ సీపీ పెదకూరపాడు సమన్వయకర్త నంబూరు శంకరరావు ఆగ్రహం అధికారం శాశ్వతం కాదు.. చేసిన పనే శాశ్వతం

నెహ్రూనగర్‌(గుంటూరుఈస్ట్‌): ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయకపోగా..వైఎస్సార్‌ సీపీ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని తాను చేసినట్లుగా చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ..అధికారం ఉందనే అహంకారంతో ఏది పడితే అది మాట్లాడితే ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పెదకూరపాడు సమన్వయకర్త నంబూరు శంకరరావు అన్నారు. ఆదివారం గుంటూరు నగరంలోని పార్టీ కార్యాలయంలో శంకరరావు మాట్లాడుతూ మా పార్టీ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో తిరుగుతుంటే ఓ వ్యక్తి మా గ్రామానికి నువ్వు ఏం చేశావని ప్రశ్నిస్తే దానికి నేను సమాధానం చెప్తే నీ కెందుకు..నన్ను ఎందుకు కదిలిస్తున్నావని ప్రశ్నిస్తున్నారు. నీ పని నువ్వు చేసుకో..నా జోలికి వస్తే నువ్వు చేసే అరాచాకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు బయటకు తీస్తానని అన్నారు. వంద గ్రామాలు..వంద రోజులు అని కార్యక్రమం పెట్టి రోజుకు ఒక అరగంట తిరిగి తానేదో పనిచేసున్నట్లు హై కమాండ్‌కి చెప్పుకోవడమే తప్ప ప్రజలకు ఈ రెండేళ్లలో ఏ సంక్షేమ కార్యక్రమం కానీ..అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టావా..ప్రజల సమస్యలను పరిష్కరించావా అని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ను ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను అక్కడే పరిష్కరించడంతోపాటు టీడీపీ నాయకుల ఇళ్లకు కూడా వెళ్లి వారి సమస్యలను అక్కడే పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రామాల్లో నీ గురించి ప్రజలు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకో..తెలియకపోతే నీ మనిషిని పెట్టుకుని తెలుసుకోవాలని హితవు పలికారు. నియోజకవర్గంలోకి నన్ను రానివ్వవా..రానివ్వపోవడానికి నువ్వు ఎవరివి..ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు..అధికారం ఉందని..కళ్లు నెత్తికెక్కితే ప్రజలే నీ అధికారాన్ని దించుతారు..నియోజకవర్గంలోకి ఎవరిని రానివ్వాలో..ఎవర్ని రానివ్వకూడదో ప్రజలే తేలుస్తారన్నారు.

వైఎస్సార్‌ సీపీ హయాంలో రూ.682.58కోట్లతో అభివృద్ధి

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో పెదకూరపాడు నియోజకవర్గంలో రూ.1483.24 కోట్లతో సంక్షేమం, రూ.682.58 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. రూ.148కోట్లతో అమరావతి, బెల్లంకొండ డబుల్‌ రోడ్‌, రూ.60 కోట్లతో మాదిపాడు వద్ద కృష్ణా నదిపైన బ్రిడ్జి, రూ.7.25 కోట్లతో పాలిటెక్నిక్‌ కాలేజ్‌, రూ.4 కోట్లతో పెదమద్దూరు బ్రిడ్జి, శ్రీవాణి ట్రస్ట్‌ ద్వారా దేవాలయాల నిర్మాణానికి రూ.5.80 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.

ఒక్క రైతుకై నా ప్లాటు ఇచ్చారా?

రాజధాని నిర్మాణం పేరుతో 54 వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి లాక్కుని 9 వేల ఎకరాల్లో భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇస్తామని చెప్పిన మీరు...ఏ ఒక్క రైతుకై నా ప్లాట్‌ ఇచ్చారా అని ప్రశ్నించారు. 9 వేల ఎకరాలు పోతే మిగిలిన 43 వేల ఎకరాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. మీరేమో వ్యాపారాలు చేసుకోవాలి, రైతుల్ని మాత్రం ముంచేయాలని చూస్తున్నారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని..రాజధాని పేరుతో జరుగుతున్న భూ దోపిడీకి వ్యతిరేకమన్నారు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కలుపుతూ మావిగన్‌ రాజధాని చేయాలని వైఎస్‌ జగన్‌ ప్రతిపాదించారు. చంద్రబాబునాయుడు కూడా గుంటూరు, విజయవాడ, మచిలీపట్నంతో కలిపి సీఆర్‌డీఏ ఉంటుందని చెప్పారు. రూ.20 వేల కోట్లతో పూర్తయే రాజధాని కావాలా..రూ. 2లక్షల కోట్లతో పూర్తయ్యే రాజధాని కావాలో ప్రజలే గ్రహించాలని అన్నారు. నియోజకవర్గ పరిశీలకులు యెనుమల మురళీధర్‌రెడ్డి, పెదకూరపాడు ఎంపీపీ బెల్లంకొండ మీరయ్య, వైఎస్సార్‌ సీపీ నాయకులు కొండవీటి కోటేశ్వరరావు, భవిరిశెట్టి హనుమంతరావు, నర్సిరెడ్డి, అప్పిరెడ్డి, సాయిరెడ్డి, నాయుడు రాంబాబు, షేక్‌ సుభాని పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement