రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Apr 13 2026 7:38 AM | Updated on Apr 13 2026 7:38 AM

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి బెల్లంకొండ మేజర్‌ కాలువలో పడి మహిళ మృతి రాజుపాలెం: ద్విచక్రవాహనంపై గ్రామానికి వెళుతూ ప్రమాదవశాత్తూ భార్యాభర్తలు ఎన్‌ఎస్‌పీ కాలువలో పడగా భార్య మృతి చెందిన సంఘటన మండలంలోని అనుపాలెం సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని అంచులవారిపాలెం గ్రామానికి చెందిన నీలం వెంకయ్య, భార్య అంకమ్మ ద్విచక్రవాహనంపై గుంటూరు బయలుదేరారు. ద్విచక్ర వాహనాన్ని బెల్లంకొండ అడ్డరోడ్డులో ఉంచి, బస్సులో గుంటూరు వెళ్లారు. వైద్యశాలలో మందులు తీసుకుని స్వగ్రామానికి బస్సులో బయలుదేరి అడ్డరోడ్డు వద్ద శనివారం రాత్రి 10 గంటలకు దిగారు. ఇరువురు ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరారు. మార్గంమధ్యలో పెద్దకాలువ వద్దకు వెళ్లే సరికి ఎదురుగా లారీ వచ్చింది. లారీ లైట్ల వెలుతురుకు రోడ్డు మార్జిన్‌ కనిపించకపోవడంతో ద్విచక్రవాహనంతోపాటు భార్యాభర్తలు పెద్ద కాలువలో పడిపోయారు. వెంకయ్య బయటకు రాగా భార్య అంకమ్మ (38)నీటిలో కొట్టుకు పోయింది. వెంకయ్య వేరే ఫోన్‌ ద్వారా బంధువులకు తెలియపరచడంతో హుటాహుటిన గ్రామస్తులు కాలువ వద్దకు చేరుకుని గాలింపు ప్రారంభించారు. సుమారు రాత్రి 2 గంటల సమయంలో పడిన దగ్గర నుంచి 2 కిలోమీటర్ల దూరంలో గల మాచాయపాలెం లాకుల వద్ద అంకమ్మ మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మణికృష్ణ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరళించారు. బెల్లంకొండ మేజర్‌ కాలువకు ఇరువైపుల రెయిలింగ్‌ లేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు బంధువులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎన్‌ఎస్‌పీ అధికారులు రెయిలింగ్‌ ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదం జరిగిందని, రెయిలింగ్‌ ఉన్నట్‌లైతే దానికి తగిలి ద్విచక్ర వాహనం ఆగిపోయేదని గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రమాదానికి అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. టిడ్కో గృహాల్లో కార్డెన్‌ సెర్చ్‌ గుంటూరు రూరల్‌: అడవితక్కెళ్లపాడులోని టిడ్కో గృహాల సముదాయాల్లో ఆదివారం పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాల మేరకు సౌత్‌ సబ్‌డివిజన్‌ ఇన్‌చార్జి డీఎస్పీ మధుసూదనరావు నేతృత్వంలో సోదాలు నిర్వహించారు. మొత్తం 70 మంది పోలీస్‌ అధికారులు, పోలీస్‌ సిబ్బందితో ఏడు పార్టీలుగా విభజించి తనిఖీలు నిర్వహించారు. సుమారు 800 ప్లాట్లలో సోదాలు చేశారు. మొత్తం 200 వాహనాలను పరిశీలించి సరైన పత్రాలు లేని 87 మోటార్‌ సైకిళ్లు, 15 ఆటోలు, మొత్తం 102 వాహనాలను గుర్తించి, వీటికి సంబంధించి మోటార్‌ వాహనాల చట్టం నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.36,880 జరిమానాలు విధించారు. గతంలో గంజాయి కేసుల్లో పాల్గొన్న నిందితులను విచారించి, వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. డీఎస్పీ మాట్లాడుతూ అల్లరి మూకలు గంజాయి సేవించి గొడవలు చేస్తూ, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సమాచారం మేరకు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించామన్నారు. స్కూళ్లు, కాలేజీలు, పని ప్రదేశాలలో, తెలిసిన వారికి, స్నేహితులకు గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వలన కలిగే నష్టాల గురించి తెలపాలని ప్రజలకు సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఒక్కసారి అలవాటైతే అది వ్యసనంగా మారి భవిష్యత్తును నాశనం చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో నల్లపాడు సీఐ వంశీధర్‌, వట్టిచెరుకూరు సీఐ రామానాయక్‌, ఎస్సైలు, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఎనిమిది మందికి గాయాలు

సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మందికి గాయాలైన సంఘటన సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు వద్ద ఆదివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి 20 మంది మత్స్యకారులు ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడు గ్రామంలోని చెరువులో రొయ్యలు పట్టేందుకు వస్తున్నారు.బొల్లేరో వాహనంలో మత్స్యకారులు వస్తుండగా సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు వద్దకు చేరుకోగానే డ్రైవర్‌కు నిద్రమత్తు రావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో సంగడి జోగేశ్వరరావు (45) మృతి చెందగా మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. సత్తెనపల్లి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాలువకు రెయిలింగ్‌ లేకపోవడంతో ప్రమాదం..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement