నేడు గంగమ్మ తల్లి తిరునాళ్ల | - | Sakshi
Sakshi News home page

నేడు గంగమ్మ తల్లి తిరునాళ్ల

Apr 12 2026 3:06 AM | Updated on Apr 12 2026 3:06 AM

నేడు గంగమ్మ తల్లి తిరునాళ్ల

తెలంగాణ, తమిళనాడు, కేరళం, కర్ణాటకల నుంచి భక్తుల రాక 39వ శిడిమహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

కారంచేడు: కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగాను, సంతాన లక్ష్మిగాను పేరొంది విరాజిల్లుతున్న గ్రామదేవత గంగమ్మ తల్లి తిరునాళ్లను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. కారంచేడు పుట్టాయిపాలెంలో కొలువైన అమ్మవారికి 39 సంవత్సరాలుగా శిడి మహోత్సవాలను కనుల పండువగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నాలుగు రోజుల నుంచి అమ్మవారికి వివిధ రకాల ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ, గ్రామస్తులు పెద్దఎత్తున నైవేద్యాలు సమర్పిస్తున్నారు. ఆదివారం వేకువజామునుంచే అమ్మవారిని వివిధ రకాల ప్రత్యేకమైన పూలతో అలంకరిస్తారు. గ్రామస్తులు ఎక్కడ ఉన్నా గ్రామానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. తమ పాడి పశువులను, వాహనాలను సైతం అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించుకుంటారు. తిరునాళ్ల సందర్భంగా వివిధ ప్రాంతాలు, జిల్లాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరు, మజ్జిగ, పులిహోర, అల్పాహారం వంటి స్టాల్సు సైతం ఏర్పాట్లు జరుగుతున్నారు. విద్యుత్‌ ప్రభలు, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు.

పెద్ద ఎత్తున హాజరు కానున్న భక్తులు..

ఈ ఏడాది గంగమ్మ తిరునాళ్లను పెద్దఎత్తున నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. నాలుగు రోజుల నుంచి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులతో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామానికి చెందిన ఆడపడుచులు, భక్తులు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారితోపాటు, తెలంగాణ, తమిళనాడు, కేరళం, కర్ణాటకల నుంచి కూడా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. గ్రామానికి వచ్చే భక్తులు ఆలయం వద్దకు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆలయం చుట్టూ ప్రదిక్షణలు చేస్తారని కమిటీ సభ్యులు చెప్పారు.

పటిష్టమైన పోలీసు బందోబస్తు..

తిరునాళ్లు ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం వేకువజాము వరకు నిర్విరామంగా జరుగుతాయి. ఇంకొల్లు సీసీ వైవీ రమణయ్య కారంచేడు పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాట్లపై సమీక్షించారు. వేల సంఖ్యలో భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారనే సమాచారంతో పోలీస్‌ బందోబస్తును పటిష్టంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వివిధ స్టేషన్ల నుంచి ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, పోలీస్‌, హోంగార్డులను బృందాలుగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తిరునాళ్లు జరిగే తీరును ఆయన ఆలయ కమిటీ సభ్యులతో చర్చించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement