మోపిదేవి: స్థానిక శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి గుంటూరుకు చెందిన భక్తులు ధరణికోట గిరిజ శుక్రవారం రూ. 90.001 విరాళంగా సమర్పించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఈ విరాళాన్ని ఆలయ సూపరిటెండెంట్ అచ్యుత మదుసూధనరావుకు అందచేశారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో దాతను సత్కరించారు.
గుంటూరు వెస్ట్(క్రీడలు): న్యూ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ బాస్కెట్ బాల్ ఆధ్వర్యంలో అండర్–18 బాల బాలికల బాస్కెట్‌బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రేవతి, జి.ఆంజనేయులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న క్రీడాకారులు పాల్గొనవచ్చన్నారు. ఈ పోటీలను సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక జేకేసీ కళాశాల రోడ్డులోని టాప్ కిడ్స్ స్కూల్లో ఏర్పాటు చేశామన్నారు. పాల్గొనే వారు పోటీలకు అరగంట ముందు రిపోర్ట్ చేయాలని తెలిపారు. వయస్సు ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ తప్పక తీసుకురావాలని పేర్కొన్నారు. వివరాలకు ఆంజనేయులు 98663 34528 నెంబర్‌కు సంప్రదించాలని కోరారు.
ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూలో ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్సెస్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో శనివారం ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా స్పెషల్ కమిషనర్ సౌమ్య, కమిషనర్ డాక్టర్ కె.రవిశంకర్ హాజరయ్యారు. ఈ స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా క్రికెట్, టెన్నిస్, షటిల్, టెన్నికాయిట్, చెస్, 2 కే రన్, 1కే రన్, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్ తదితర విభాగాల్లో క్రీడలు నిర్వహించారు. కార్యక్రమంలో గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు టి.రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి కె.మురళీకృష్ణ, కల్చరల్ సెక్రటరీ జగదీష్‌బాబు పాల్గొన్నారు.
పట్నంబజారు(గుంటూరుఈస్ట్)
రాజధాని అమరావతి గురించి ప్రస్తావిస్తూ ట్విట్టర్ వేదికగా పోస్టింగ్ పెట్టాడనే నెపంతో సోషల్ యాక్టివిస్ట్‌పై కొత్తపేట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. రాజధాని అమరావతి గురించి జగన్ వారియర్ అనే పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ ద్వారా రాజధానికి సంబంధించిన పలు అంశాలు ప్రస్తావిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టులు పెట్టాడు. దీనిపై పలువురు టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ యాక్టివిస్ట్ కోసం గాలిస్తున్నట్లు సమాచారం.
నరసరావుపేట రూరల్: విషం సేవించి యువకుడు మృతిచెందిన ఘటన ఇస్సపాలెం– జొన్నలగడ్డ బైపాస్‌రోడ్డులో శనివారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు. బెల్లంకొండ మండలం పాపాయపాలేనికి చెందిన బిట్రగుంట వెంకట్రావు(28) పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. మానసిక ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో గతంలో ఒకసారి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. హైదరాబాద్‌లో చికిత్స పొంది కోలుకున్న వెంకట్రావు ఆసుపత్రిలో విధులకు హాజరవుతున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం ఇస్సపాలెం–జొన్నలగడ్డ బైపాస్‌లోని పంట పొలంలో వెంకట్రావు విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో రూరల్ ఎస్‌ఐ కిషోర్ ఘటాన స్థలాన్ని పరిశీలించి మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
నగరంపాలెం: గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విధులు నిర్వర్తించే డీఎస్పీ బి.సునీల్ బదిలీయ్యారు. కొద్దిరోజుల కిందట రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డీఎస్పీల బదిలీలు జరగ్గా, ఆయన్ను విశాఖపట్నం ఏపీఎస్పీ 16వ బెటాలియన్ డీఎస్పీగా బదిలీ చేశారు. గుంటూరు సీఐడీలో సుమారు ఏడాదిపాటు సునీల్ విధులు నిర్వర్తించారు.


