సందేశాత్మకం.. అద్భుత కళారూపం | - | Sakshi
Sakshi News home page

సందేశాత్మకం.. అద్భుత కళారూపం

Apr 12 2026 3:06 AM | Updated on Apr 12 2026 3:06 AM

సందేశాత్మకం.. అద్భుత కళారూపం

యడ్లపాడు: లింగారావుపాలెం వేదికగా సాగుతున్న కొండవీటి కళా పరిషత్‌ 27వ జాతీయస్థాయి కళా సంబరాలు రెండోరోజు శనివారం మూడు నాటికలు ప్రదర్శితమయ్యాయి. ఆయా నాటికల్లోని సంఘటనలు నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ నిత్యం చూస్తున్న వాస్తవ ఘటనలకు దర్పణం పట్టాయి.

‘శ్రీమాత్రే నమః’

ఆకాశమంత ఆశ.. అమెరికా వెళ్లాలన్న ఆశయం.. కెరీర్‌ పరుగులో అందరికంటే ముందుండాలన్న తపన.. ఇదీ నేటితరం ప్రతినిధి అయిన ఒక ఆధునిక యువతి జీవన చిత్రానికి కళారూపమే సీ్త్ర మాత్రే నమః నాటిక. అయితే జీవితం ఎప్పుడూ మనం గీసుకున్న గీతల్లోనే సాగదు. అనూహ్యంగా ఎదురైన ఒక ప్రమాదం ఆమె ఆశల విమానాన్ని నేలకూల్చడమే కాదు, ఆమె జీవన ప్రయాణాన్నే ఓ మలుపు తిప్పిందని సునిశితమైన సంఘర్షణలతో అద్భుతంగా ఆవిష్కరించింది నాటిక. స్వర్ణసూర్య డ్రామా లవర్స్‌(హైదరాబాద్‌)వారు సమర్పించగా మూలకథను పూర్ణిమా పెమ్మరాజు అందించగా, ఉదయ భాగవతుల రచన, దర్శకత్వం వహించారు.

‘మమ్మల్ని బతకనివ్వండి’

కుండపోత వర్షంలో భార్య ప్రాణం గాలిలో దీపంలా కొట్టుమిట్టాడుతుంటే, సాయం కోసం గొంతు చించుకుని విలపిస్తున్న ఆర్తనాదాలు వినిపించింది కనిపించింది కేవలం వ్యాపారమే. మనిషి ప్రాణం కంటే డబ్బుకే విలువ పెరిగిన ఈ కాలంలో, తన వద్ద ఉన్న సర్వస్వాన్ని ధారపోసినా ఆ వృద్ధుడికి మిగిలింది మరణమే. వరద భీభత్సంలో మూర్ఛవ్యాధికి చిక్కి తన కళ్ల ముందే ఇల్లాలు కన్నుమూస్తుంటే, నిస్సహాయుడై ఆ ముసలాయన రోదించిన తీరు ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. ఒకవైపు ప్రకృతి విలయాన్ని, మరోవైపు అంతకుమించిన మనుషుల నైతిక పతనాన్ని కళ్లకు కట్టి చూపిందీ నాటిక. విజయవాడ సాంస్కృతిక సమితి వారు ప్రదర్శించిన ఈ రూపకం, పల్లెటూరి యాసతో, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో సాగుతూ చివరి వరకు ప్రేక్షకులను కట్టిపడేసింది. రచన, దర్శకత్వం సుఖమంచి కోటేశ్వరరావు వహించారు.

‘తరమెళ్లిపోతున్నదో..’

మరణం తర్వాత కూడా మనిషి జ్ఞాపకం బతకాలంటే, అతడు బ్రతికున్నప్పుడు పంచిన ప్రేమలో నిజాయితీ ఉండాలి. తోడునీడగా ఉండాల్సిన రక్తసంబంధాల మధ్య ఆస్తులు, అంతస్తులు చిచ్చుపెడితే, కోట్లు ఉన్నా ఆ మనిషి ఒంటరివాడేనని కథనమే తరమెళ్లిపోతున్నదో నాటిక. శేషయ్య, దశరథ రామయ్య అనే ఇద్దరు మిత్రుల నేపథ్యంతో మొదలయ్యే ఈ కథ, విద్య యొక్క విలువను, త్యాగంలోని గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూనే, ఆధునిక సమాజంలోని కృత్రిమ బంధాలపై చావుదెబ్బ కొట్టింది. తండ్రి చదివించకపోయినా, తన కొడుకు రాఘవరావును గొప్ప ఆఫీసర్‌గా చూడాలనుకున్న ఒక పేద తండ్రి ఆశయం వెనుక, మరో కొడుకు రంగనాథం చేసిన నిశ్శబ్ద త్యాగం ఈ నాటికలో ప్రతి ఒక్కరినీ కదిలించివేసింది. తమ ఇంట శుభకార్యానికి ఊరంతా పిలిచి తోడబుట్టిన వారిని వెలివేసే నేటి తరం వికృత పోకడలను బొమ్మిడి రామకృష్ణ తన దర్శకత్వంతో కళ్లకు కట్టారు. దీనిని కరణం సురేష్‌ మెమోరియల్‌ థియేటర్స్‌(గుంటూరు) వారు ప్రదర్శించిన ఈ నాటిక నవసమాజానికి మేలుకొలుపుగా నిలిచింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement