మేడికొండూరు: రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడిన ఘటన మండలంలోని జంగంగుంట్లపాలెం సమీపంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నరసరావుపేట మండలం మక్కినవారిపాలెంలో రాత్రి జరిగిన వివాహానికి హాజరైన దీపక్, చాణిక్య, వారి కుటుంబ సభ్యులతో సత్తెనపల్లి నుంచి గుంటూరు వైపు వెళ్తున్నారు. వీరు జంగంగుంట్లపాలెం సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న మరొక కారు బలంగా ఢీకొంది. ఎదురుగా వస్తున్న మరొక కారులో ఉన్న జొన్నలగడ్డ ప్రసూనతో పాటు భర్త బాంబే సుబ్రహ్మణ్యం, కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న మేడికొండూరు సీఐ మధుసూదనరావు, ఎస్‌ఐ ఖాజీబాబు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని పోలీసు వాహనంలో గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


