బియ్యం బుక్కి... పేద కడుపు కొట్టి... | - | Sakshi
Sakshi News home page

బియ్యం బుక్కి... పేద కడుపు కొట్టి...

Apr 11 2026 8:10 AM | Updated on Apr 11 2026 8:10 AM

భారీగా దారి మళ్లుతున్న రేషన్‌ బియ్యం

తాజాగా బియ్యం పట్టివేత

అనుకూలురైతే రైట్‌, రైట్‌

లేదంటే చట్టపరంగా చర్యలు

నల్లబజారు వ్యాపారి మాట వినకపోతే ఇక అంతే సంగతులు

డీలర్‌షిప్‌ కూడా మారుస్తామని

హెచ్చరికలు

ఇప్పటికే కొన్నిచోట్ల డీలర్ల మార్పు

ముందెన్నడూ లేని అక్రమ పోకడలు

తాజాగా 12 బస్తాల బియ్యం పట్టివేత

చీరాల అర్బన్‌: చీరాల నియోజకవర్గంలో రేషన్‌ బియ్యం దారి మళ్లుతోంది.. ఇదంతా ఒంగోలుకు చెందిన దివ్యాద్రి అనే నల్లబజారు వ్యాపారి కనుసన్నల్లో జరుగుతోంది. అందుకు కీలక నేత, యువనేత అండ ఉండటమే కారణం. ఈ క్రమంలో నల్లబజారు వ్యాపారి పలువురు డీలర్లపై జులుం ప్రదర్శిస్తున్నాడు. అందుకు సంబంధిత అధికారులు స్వామి కార్యం.. స్వకార్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారని చెప్పుకొంటున్నారు. తాము చెప్పిన మేరకు బియ్యం ప్రతి నెలా ఇవ్వాల్సిందేనని డీలర్లపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో డీలర్ల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైందని చెప్పుకుంటున్నారు. బియ్యం బదులు డబ్బులు తీసుకోమంటే పలు చోట్ల కార్డుదారులు వ్యతిరేకిస్తున్నారు. తమకు బియ్యమే కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. వైకుంఠపురంలో జరిగిన సంఘటనలు అందుకు నిదర్శనమని ఆయా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో నల్లబజారు వ్యాపారి చెప్పినట్లు వినకపోతే డీలర్లును మారుస్తామని బెదిరిస్తున్నట్లు చెప్పుకొంటున్నారు. ఇప్పటికే పలువురు డీలర్లను మార్చారని సమాచారం. గతంలో ఇలాంటి ధోరణి లేదని పలువురు డీలర్లు వాపోతున్నారు. ఈ క్రమంలో సంబంధిత అధికారులు స్వామి కార్యం... స్వకార్యం అన్నట్లు డీలర్లలో అస్మదీయులైతే ఒక రకంగా, తస్మదీయులైతే మరో రకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

చర్యలు శూన్యం

నల్లబజారు వ్యాపారికి అనుకూలంగా వ్యవహరించే డీలర్ల నుంచి రేషన్‌ బియ్యం సేకరించే సమయంలో ఎవరన్నా సమాచారం ఇచ్చినా సంబంధిత అధికారులు స్పందించటం లేదు. వారిపై చర్యలు చేపట్టకుండా రవాణాకు రైట్‌ రైట్‌ అంటున్నారు. గత నెలలో కారంచేడు గేటు సెంటర్లో రాత్రి వేళ రేషన్‌ బియ్యం లోడింగ్‌ జరిగే సమయంలో సమాచారం అందించినా స్పందించకపోవటం అందుకు నిదర్శమనే వాదనలు వినిపిస్తున్నాయి. వెలుగులోకి వచ్చిన సంఘటన ఇదొక్కటే. అయితే ప్రతి నెలా 5 నుంచి 15వ తేదీ వరకు ప్రతి రోజు రేషన్‌ బియ్యం నల్లబజారుకు తరలుతూనే ఉందని విషయం తెలిసిన వారు చెబుతున్నారు. రేషన్‌ బియ్యం నల్లబజారుకు తరలే క్రమంలో నైట్‌ బీట్‌ పోలీసులకు ఎప్పుడు కూడా కనిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది. అలానే సివిల్‌ సప్లయిస్‌, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల పరంగా చర్యలు కూడా లేవని బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

అన్నీ నిజాలే..

కార్డుదారులకు ప్రతి నెల పంపిణీ చేయాల్సిన రేషన్‌ బియ్యాన్ని కొంత ఇచ్చి, మరికొంత కార్డుదారుల అంగీకారంతో, ఇంకొంత డీలర్ల చేతివాటంతో సమీకరిస్తున్నారు. అధికారుల తనిఖీల్లో రేషన్‌ షాపుల్లో వెలుగులోకి వస్తున్న అక్రమాలు అందుకు నిదర్శనం. అధికారులు ఎప్పుడు చర్యలు చేపడతారో .. వేచి చూడాల్సిందే.

బుధవారం ఉదయం స్వర్ణరోడ్డులో ఆటోలో రేషన్‌ బియ్యం తరలుతున్నాయనే సమాచారంతో వన్‌టౌన్‌ పోలీసులు వలపన్ని ఆ ఆటోను పట్టుకున్నారు. అందులో 12 బస్తాల రేషన్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఆటో సహా స్టేషన్‌కు తరలించారు. సంబంధికులపై కేసు నమోదు చేశారు. అవి నల్లబజారు వ్యాపారి దివ్యాద్రి , అతని అనుచరులకు తెలియకుండా ఇళ్ల వెంట తిరిగి ఓ మహిళ కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. నల్లబజారు వ్యాపారికి ఎక్కడా గుప్పెడు బియ్యం కూడా తగ్గకుండా ఉండేందుకు, మరొకరు రేషన్‌ బియ్యం కొనుగోలు చేయకుండా ఉండేందుకు ఓ మహిళ ఇళ్ల వెంట తిరిగి సేకరించుకున్న రేషన్‌ బియ్యాన్ని తరలించే క్రమంలో పోలీసులు తమకు అందిన సమాచారం మేరకు పట్టుకున్నట్లు చెబుతున్నారు. ప్రతి నెల 5 నుంచి 15వ తేదీ వరకు వందల రేషన్‌ బియ్యం బస్తాలు నల్లబజారుకు తరలుతున్నాయని, వాటి సమాచారం పోలీసులకు, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, సివిల్‌ సప్లయిస్‌ అధికారులకు అందకపోవటం విస్మయం కలిగిస్తోందని ప్రజలు మండపడుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement