దేశ రాజకీయాల్లో
బాపట్ల: దేశ రాజకీయాల్లో కోన ప్రభాకరరావు కీలకపాత్ర పోషించారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున పేర్కొన్నారు. పాతబస్టాండ్‌లో ఏర్పాటు చేసిన కోన ప్రభాకరరావు విగ్రహాన్ని శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. నాగార్జున మాట్లాడుతూ బాపట్ల ప్రాంత అభివృద్ధితోపాటు దేశ చరిత్రలోనే బాపట్లకు గుర్తింపు తీసుకువచ్చిన ఘనత కోన ప్రభాకరరావుకు దక్కిందన్నారు. కోన ప్రభాకరావు మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేయటంతోపాటు కాంగ్రెస్‌పార్టీలో కీలకమైన పదవులు ఎన్నో చేపట్టారని గుర్తు చేసుకున్నారు. కోన ప్రభాకరరావు తనయుడు మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ కోన ప్రభాకరరావు కుమారుడుగా పుట్టడం తాను చేసుకున్న అదృష్టంగా పేర్కొన్నారు. క్రీడా, రాజకీయ, సినీరంగం, న్యాయవాది.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉన్నతంగా రాణించటం కోన ప్రభాకరరావుకే దక్కిందన్నారు. అనునిత్యం బాపట్ల ప్రాంత అభివృద్ధికి ఆయన కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. బాపట్లను విద్యకేంద్రంగా రూపాంతరం చెందేందుకు ఆయన తీసుకున్న నిర్ణయాలే ఈ ప్రాంతాభివృద్ధికి బీజాలు అని చెప్పారు. బాపట్ల నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్లినా తాగు, సాగునీటిని అందించారని ప్రభాకరరావును ప్రజలు గుర్తు చేసుకోవటం తనకు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. బాపట్ల ప్రాంతంలో పాతబస్టాండ్ రోడ్డు విస్తరణ సందర్భంగా విగ్రహాన్ని తొలగించారని, తిరిగి విగ్రహం ఏర్పాటు చేస్తారా... లేదా... అనే సందేహాల మధ్య విగ్రహం ఏర్పాటు చేయటం ఎంతో సంతోషకరమని చెప్పారు. ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, సమన్వయ కర్తలు వరికూటి అశోక్‌బాబు, కరణం వెంకటేష్‌బాబు, పీటా నాగ మోహన్‌కృష్ణ, చింతలపూడి అశోక్, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, పార్టీ నాయకులు కొక్కిలిగడ్డ చెంచయ్య, వడ్డి ముక్కల డేవిడ్, దొంతిబోయిన సీతారామిరెడ్డి, కోకి రాఘవరెడ్డి, చేజర్ల నారాయణరెడ్డి, చల్లా రామయ్య తదితరులు పాల్గొన్నారు.


