గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి మాతృ మరణాలపై శుక్రవారం వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. అడిషనల్ డైరెక్టర్ మెటర్నల్ హెల్త్ డాక్టర్ కే.అనిల్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఏప్రిల్ 2025 నుండి మార్చి 2026 వరకు జిల్లాలో సంభవించిన 14 మాతృ మరణాలపై సమావేశంలో సమీక్షించారు. మాతృ మరణాలకు గల కారణాలను సమీక్షించిన కమిటీ సభ్యులు పైన సంభవించిన మరణాలలో ఏడు నివారించదగినవని, మిగితా ఏడు నివారించలేనివని నిర్ధారించారు. డాక్టర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి మాతృమరణాన్ని సమాజ స్థాయిలో, ఆసుపత్రి స్థాయిలో సమగ్రంగా సమీక్షంచుకొని, మున్ముందు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ఈ విషయాలపై వైద్యాధికారులకు, పారామెడికల్ సబ్బందికి రీ ఓరియంటేషన్ ట్రైనింగ్ నిర్వహించాలని తెలిపారు. గర్భిణులు, వారి కుటుంబసభ్యులకు, గర్భస్థ దశలో ప్రమాదకర పరిస్థితులపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు పరస్పరం కలిసి పనిచేసి మాతృ మరణాలు తగ్గించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ కుమార్, స్టేట్ ప్రోగ్రాం ఆఫీసర్‌లు డాక్టర్ సి.హెచ్.శిరీష, డాక్టర్ నిర్మలగ్లోరి, స్టేట్ కన్సల్టెంట్ యూనిసెఫ్ డాక్టర్ నాగేంద్ర, డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు, ప్రోగ్రాం ఆఫీసర్లు కమిటీ మెంబర్లు పాల్గొన్నారు.


