రంగస్థలిపై మానవీయ సంతకాలు | - | Sakshi
Sakshi News home page

రంగస్థలిపై మానవీయ సంతకాలు

Apr 11 2026 8:10 AM | Updated on Apr 11 2026 8:10 AM

రంగస్థలిపై మానవీయ సంతకాలు

లింగారావుపాలెంలో ఉత్సాహంగా కళా సంబరాలు ప్రారంభించిన నాటక అకాడమీ చైర్మన్‌ గుమ్మడి గోపాలకృష్ణ ఆలోచింపజేసిన తొలిరోజు నాటికలు

యడ్లపాడు: జగతిని జాగృతం చేసేవి కళారూపాలేనని ఏపీ రాష్ట్ర తెలుగు నాటక అకాడమీ చైర్మన్‌ గుమ్మడి గోపాలకృష్ణ తెలిపారు. రసవత్తరమైన నటనకు, భావోద్వేగాలకు వేదికగా నిలిచే లింగారావుపాలెంలో కొండవీటి కళా పరిషత్‌ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథి ఏపీ తెలుగు నాటక అకాడమీ చైర్మన్‌న్‌ గుమ్మడి గోపాలకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేయగా, పుడమి మైన్స్‌ డైరెక్టర్‌ ముత్తవరపు అరుణకుమారి నటరాజ పూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిషత్‌ అధ్యక్షులు కట్టా శ్రీహరిరావు అధ్యక్షత వహించారు. గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ సమాజంలోని రుగ్మతలను ఎండగట్టే గొప్ప శక్తి సింగిల్‌ టేక్‌లో ప్రదర్శించే ఒక్క నాటకానికి మాత్రమే ఉందన్నారు. సీఐడీ డీఎస్పీ గోలి లక్ష్మయ్య మాట్లాడుతూ నాటక రంగాన్ని నడిపిస్తున్నవి పరిషత్తులు, దాతలు మాత్రమే అన్నారు. ముత్తవరపు అరుణకుమారి మాట్లాడుతూ నాటక రంగానికి పూర్వవైభవానికి తీసుకువచ్చే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఆంధ్ర ఇంటలెక్చువల్స్‌ ఫోరం నేత చలసాని శ్రీనివాస్‌, విరించి రిసార్ట్స్‌ అధినేత నెల్లూరి వంశీకష్ణ, పఠాన్‌ సుభాని, ఆలోకం అమరలింగస్వామి, కిలారు వెంకటరావు, నంబూరు నరసింహారావు, కృష్ణారావు, శొంఠినేని సాంబశివరావు పాల్గొని ప్రసంగించారు.

వ్యాపారమైన మాతృత్వంపై కన్నీటికి విలువెంత..?

సమాజంలోని అతి కిరాతకమైన వైద్య మాఫియా ముఖాన్ని బట్టబయలు చేసింది. అమ్మ ప్రేమను కూడా అంగడి సరుకుగా మారుస్తున్న డాక్టర్‌ సరోజినీ దేవి అరాచకాలను, సామాన్య సీ్త్రల పోరాట పటిమను ఈ నాటిక అద్భుతంగా చిత్రించింది. నర్సు నందిని అందించిన సహకారంతో, బాధితులు సీతాలు, మాధవి తమ కన్నీటిని ఆయుధాలుగా మలిచి వ్యవస్థలోని అన్యాయంపై సమరశంఖం పూరించారు. డి.కామేశ్వరి కథను దృశ్యరూపంలోకి మలిచిన విధానం, బీవీకే క్రియేషన్స్‌ వారి నటన.. వైద్య రంగంలో మంటగలుస్తున్న నైతిక విలువలను ప్రశ్నించడమే కాకుండా, సీ్త్ర శక్తి తలచుకుంటే ఎంతటి కుట్రనైనా ఛేదించగలదని నిరూపించింది.

మాయాలోకంలో మనీషిని వెతికిన మంచి మనసులు..

స్వార్థం రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలో నిస్వార్థ సేవ యొక్క ప్రాధాన్యాన్ని హృదయాలకు హత్తుకునేలా చాటిచెప్పింది. తోటి మనిషి కష్టాన్ని తనదిగా భావించేవాడే అసలైన దైవమని, రక్త సంబంధాల కంటే ఆపన్న హస్తం అందించే మానవ సంబంధాలే మిన్న అని చెరుకూరి సాంబశివరావు రచన, దర్శకత్వ ప్రతిభతో సాక్షాత్కరించారు. అందరి క్షేమాన్ని కాంక్షించే ఉన్నత ఆశయమే సమాజానికి ప్రాణవాయువు అని చాటుతూ, ఉషోదయ కళానికేతన్‌ (కట్రపాడు)బృందం ప్రదర్శించిన ఈ రూపకం మనుషుల మధ్య అంతరించిపోతున్న మమకారాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేసింది.

అందం వర్సెస్‌ అమ్మతనం..

ఇక శ్రీరమణా కళానిలయం సమర్పించిన మాతృత్వం నాటిక ఆడతనం అంటే కేవలం బాహ్యా సౌందర్యం కాదని, అది అమ్మతనంలోనే పరిపూర్ణత చెందుతుందని లోతైన విశ్లేషణ చేసింది. వృత్తి, అందం అనే వ్యామోహంలో పడి సంతానాన్ని భారంగా భావించిన లావణ్య అనే యువతి పాత్ర ద్వారా నేటి తరం ధోరణిని సునిశితంగా విమర్శించారు. అహంకారం నుంచి పశ్చాత్తాపం వైపు సాగిన ఆమె ప్రయాణం, పక్షవాతంతో ఉన్న అత్తగారి మాతృత్వ హృదయాన్ని చూసి కళ్లు తెరుచుకోవడం వంటి దృశ్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. సుఖమంచి కోటేశ్వరరావు రచనకు, పొగర్తి నాగేశ్వరరావు ప్రాణం పోయగా, మారుతున్న కాలంలో మసకబారుతున్న కుటుంబ విలువలను సరిదిద్దే కనువిప్పుగా ఈ నాటిక నిలిచింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement