త్రుటిలో తప్పిన పెను ప్రమాదం మద్యం, గంజాయి మత్తులో కారులోని వ్యక్తులు
చిలకలూరిపేట: టిఫిన్ సెంటర్‌లోకి కారు దూసుకెళ్లిన ఘటనలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మద్యం, గంజాయి మత్తులో వేగంగా వాహనం నడుపుతూ అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట పట్టణంలో గురువారం దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.... విజయవాడకు చెందిన ఇందుపల్లి హరీష్, విశాఖపట్నానికి చెందిన దూషిక్, మరో ముగ్గురు యువతులు కలసి విజయాబ్యాంకు సెంటర్‌కు సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. వీరంతా డ్యాన్సర్లు. బుధవారం వేరే ప్రాంతంలో నృత్య ప్రదర్శనలు ఇచ్చి వచ్చాక రాత్రంతా మద్యం తాగుతూ గడిపారు. దీనికి తోడు గంజాయి తీసుకుంటారని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కారు తీసుకొని ఇరువురు సిగరెట్లు తెచ్చుకొనేందుకు బయలుదేరారు. మత్తులో మునిగిపోయి ఉన్న ఇరువురు జాతీయ రహదారి పక్కన విజయా బ్యాంకు సెంటర్‌లోని ఈగల్ రెస్టారెంట్ సమీపంలోని టిఫిన్ సెంటర్‌లోకి దూసుకువెళ్లారు. నిత్యం రద్దీగా ఉండే ఈ సెంటర్‌లో అదృష్టవశాత్తు కారుకు ఎవరూ అడ్డు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారు వేగానికి రెస్టారెంటుకు సంబంధించిన భారీ విద్యుత్ బోర్డు వాహనంపై పడిపోయింది. టిఫిన్ సెంటర్‌లోని వస్తువులు ధ్వంసం అయ్యాయి. వేగంగా వచ్చి కారు పెద్ద శబ్దంతో ఢీకొనడటంతో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. టిఫిన్ ఇతర అవసరాల కోసం వచ్చిన ప్రజలు కేకలు వేస్తూ భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు కారు ప్రమాదానికి కారణమైన ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. వాహనం నడిపిన ఇందుపల్లి హరీష్‌కు న్యాయమూర్తి రిమాండ్ విధించారు.


