కొండవీటి గడ్డపై కళా సౌరభం | - | Sakshi
Sakshi News home page

కొండవీటి గడ్డపై కళా సౌరభం

Apr 10 2026 9:51 AM | Updated on Apr 10 2026 9:51 AM

కొండవీటి గడ్డపై కళా సౌరభం

జాతీయస్థాయి నాటికల పోటీలకు సర్వం సిద్ధం కొండవీటి కళా పరిషత్‌ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహణ లింగారావుపాలెంలో ఏర్పాట్లు పూర్తి

మొదటి రోజు ఇలా...

రెండో రోజు కార్యక్రమాలు...

యడ్లపాడు: కొండవీటి గడ్డపై మళ్లీ కళాకారుల సందడి మొదలుకానుంది. చరిత్రకు నిలువుటద్దంగా నిలిచే కొండవీడు కోట నీడన, లింగారావుపాలెం వేదికగా నాటక వైభవం మళ్లీ పురుడుపోసుకోనుంది. మొన్ననే సుందరయ్య కళానిలయంలో జరిగిన ప్రదర్శనల మధుర స్మృతులు ఇంకా మనసుల్లో మెదులుతుండగానే, అప్పుడే కొండవీటి కళా పరిషత్‌ 27వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలకు రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ మూడు రోజుల సంబరం, అటు చారిత్రక వారసత్వాన్ని, ఇటు ఆధునిక కళా చైతన్యాన్ని మేళవించి తెలుగు నాటక రంగానికి కొత్త ఊపిరి పోయనుంది.

పాతికేళ్ల ప్రస్థానం...

పాతికేళ్లకుపైగా నాటక కళే శ్వాసగా సాగుతున్న ఈ పరిషత్‌ ప్రయాణం అభినందనీయం. గ్రామీణ వాతావరణంలో జాతీయ స్థాయి నాటికలను ప్రదర్శిస్తూ, కళామతల్లి సేవలో తరిస్తున్న ఈ సంస్థ వెనుక నిర్వాహకుల అకుంఠిత దీక్ష కనిపిస్తోంది. సినీ నటులు పోసాని కృష్ణమురళి గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఈ పరిషత్‌ను కట్టా శ్రీహరిరావు, తోకల సాంబశివరావు, నంబూరు వీరాంజనేయులు, మండెపూడి శ్రీనివాసరావు, మల్నేని సీతారామాంజనేయులు, కనపర్తి శ్రీనివాసరావు, కట్టా వీరాంజనేయులు, నంబూరు శివరామకృష్ణ, నంబూరు బ్రహ్మవరప్రసాద్‌, జరుగుల రామారావులు నిబద్ధతతో సమన్వయంగా ముందుకు నడిపిస్తున్నారు. కేవలం వినోదం కోసమే కాకుండా భవిష్యత్తు తరాలకు మన సాంస్కృతిక వారసత్వాన్ని అందించాలనే గొప్ప సంకల్పంతో ఈ వేదికను తీర్చిదిద్దారు.

కళలకు మారుపేరు..

చారిత్రక కొండవీటి కోట వైభవాన్ని స్మరించుకుంటూనే, నేటి సమాజానికి కళల ద్వారా చైతన్యాన్ని అందించడమే లక్ష్యంగా ఈ పోటీలు సాగనున్నాయి. గ్రామ ప్రజలను, దూర ప్రాంతాల నుంచి వచ్చే కళాభిమానులను అలరించేందుకు సర్వం సిద్ధం చేసిన ఈ నాటక సంబరాలు, రాబోయే మూడు రోజుల పాటు ఈ ప్రాంతాన్ని ఒక కళా ప్రపంచంగా మార్చనున్నాయి. కళల కోలాహలంతో కొండవీటి గడ్డ మరోసారి తన ఘనకీర్తిని చాటుకునేందుకు ముస్తాబైంది.

● 12వ తేదీ ఆదివారం.. ముగింపు రోజున రాత్రి 8 గంటలకు నంబూరు నరసింహరావు జ్యోతిప్రజ్వలన చేయనున్నారు. లింగారావుపాలెం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్‌ షేక్‌ కరీమూన్‌ మాబుసుభాని నటరాజ పూజతో కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. 8.30 గంటలకు హైదరాబాద్‌ గోవాడ క్రియేషనన్స్‌ వారి అమ్మ చెక్కిన బొమ్మ నాటిక, గుంటూరు అభినయ ఆర్ట్స్‌ వారి ఇది అతని సంతకం నాటిక ప్రదర్శితం కానున్నాయి. అనంతరం మానవత సాగరి బృందం వారి అందరూ మంచివారే కానీ నాటిక ప్రదర్శితం కానుంది. ప్రదానోత్సవం జరుగుతుందని నిర్వాహక కమిటీ ప్రతినిధులు వెల్లడించారు.

తొలిరోజు 10వ తేదీ శుక్రవారం రాత్రి 8 గంటలకు ఏపీ తెలుగు నాటక అకాడమీ చైర్మన్‌ గుమ్మడి గోపాలకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేయనున్నారు. పుడమి మైన్స్‌ డైరెక్టర్‌ ముత్తవరపు అరుణకుమారి నటరాజ పూజ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రాత్రి 8.30 గంటలకు ఆకెళ్ల సత్యనారాయణ కళాప్రాంగణంలో కాకినాడ జీవీకే క్రియేషన్స్‌ వారి కన్నీటికి విలువెంత నాటికతో పోటీలు మొదలవుతాయి. ఆ తర్వాత 10.30 గంటలకు ఉషోదయ కళానికేతన్‌ వారి మంచి మనుషులు, రాత్రి 11 గంటలకు శ్రీరమణ కళానిలయం వారి మాతృత్వం నాటికలు ప్రదర్శితం కానున్నాయి.

రెండో రోజున శనివారం రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్‌ స్వర్ణసూర్య డ్రామా లవర్స్‌ వారి సీ్త్రమాత్రే నమః నాటికతో ప్రదర్శనలు పునఃప్రారంభమవుతాయి. అనంతరం రాత్రి 11 గంటలకు విజయవాడ సాంస్కృతిక సమితి వారి మమ్మల్ని బ్రతకనివ్వండి, అర్ధరాత్రి 12 గంటలకు గుంటూరు కరణం సురేష్‌ మెమోరియల్‌ థియేటర్స్‌ వారి తరమెల్లిపోతున్నదో నాటికలు ప్రేక్షకులను అలరించనున్నాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖుల సమక్షంలో సభా కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement