పెట్రోల్ బాటిల్‌తో బెదిరింపు
మంగళగిరి టౌన్: మంగళగిరి మండలం నవులూరు గ్రామంలో గురువారం ఓ వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారంటూ, అక్రమ కేసులు బనాయించారంటూ పెట్రోల్ బాటిల్‌తో సెల్ టవర్ ఎక్కి న్యాయం చేయాలంటూ ఆందోళన చేశాడు. సమాచారం అందుకున్న మంగళగిరి పట్టణ, రూరల్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్ సిబ్బంది ఆ వ్యక్తిని శాంతింపజేసేందుకు గంటల తరబడి ప్రయత్నించారు. వివరాల్లోకి వెళితే... మంగళగిరి పట్టణానికి చెందిన గోలి రామాంజనేయులుపై మంగళగిరి పట్టణ పోలీస్‌స్టేషన్లో పలు కేసులు నమోదు అయ్యాయి. ఇటీవల రౌడీషీట్ కూడా తెరిచారు. ఒక కేసులో రిమాండ్ నుంచి బయటకు వచ్చిన రామాంజనేయులును కొన్ని రోజుల కిందట నార్త్ సబ్ డివిజన్ ఉన్నతాధికారి పిలిపించి బెదిరించారంటూ రామాంజనేయులు భార్య ఆరోపించింది. అక్రమ కేసులు ఎత్తివేయాలని, రౌడీషీట్ తొలగించాలని సెల్ టవర్ ఎక్కిన రామాంజనేయులు టవర్‌పై నుండి నినాదాలు చేస్తూ హల్‌చల్ చేశాడు. నాలుగు గంటలకు పైగా జరిగిన ఈ హైడ్రామాలో పరిశీలన చేస్తామని పోలీస్ అధికారులు హామీ ఇవ్వడంతో రామాంజనేయులు సెల్ టవర్ దిగి కిందకు వచ్చాడు. అయితే గురువారం ఉదయం తాడేపల్లి ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటానని రామాంజనేయులు హడావుడి చేశాడు. అక్కడి పోలీసులు అడ్డుకుని పంపించివేశారు. గతంలో మంగళగిరి పట్టణం రత్నాల చెరువులో మహిళలను కులం పేరుతో ధూషిస్తూ దిగంబరంగా రామాంజనేయులు హల్‌చల్ చేసిన వీడియాలో అప్పట్లో సంచలనం రేపాయి. గోలి రామాంజనేయులపై రెండు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, హత్యాయత్నం కేసులు, మహిళపై దాడి కేసు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో నమోదు అయ్యాయని, రౌడీషీట్‌కూడా తెరిచినట్లు పోలీసులు తెలిపారు. రామాంజనేయులు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని పోలీసులు పేర్కొన్నారు.


