మంగళగిరిటౌన్: జాతీయ అభివృద్ధికి పరిశుభ్రత ఒక ప్రాథమిక స్తంభం అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌లో గురువారం స్వచ్ఛత పక్షోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఏప్రిల్ 1 నుండి 15వ తేదీ వరకు జరుగుతున్న స్వచ్ఛత పక్షోత్సవ కార్యక్రమాన్ని సమీక్షించి అండర్ గ్రాడ్యుయేషన్ గర్‌ల్స్ హాస్టల్‌ను శ్రీవాస్తవ ప్రారంభించారు. క్యాంపస్‌లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛత పక్వాడాపై ఎయిమ్స్ తయారుచేసిన ఐ.ఇ.సి. సామాగ్రి ప్రదర్శన స్టాల్‌ను సందర్శించి అభినందించారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ నమూనాలను ప్రదర్శించారు. అనంతరం శ్రీవాస్తవ మాట్లాడుతూ స్వచ్ఛభారత్ దార్శనికతకు అనుగుణంగా స్వచ్ఛత పక్షోత్సవాలను అమలు చేస్తున్నామన్నారు. ఆరోగ్య సంరక్షణ, నివారణ, ప్రోత్సాహక అంశాలను బలోపేతం చేయడంపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. సూపర్ స్పెషాలిటీ రంగం సంరక్షణ రంగంలో మంగళగిరి ఎయిమ్స్ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోందని తెలిపారు. కాన్వాస్ పెయింటింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్ధులకు అవార్డులు అందజేశారు. ఎనిమిది రోజులు జరుగుతున్న స్వచ్ఛత పక్షోత్సవ ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆరోగ్య కార్యకర్తలను అభినందించి సత్కరించారు. ఎయిమ్స్ ఆసుపత్రిలోని ఔట్ పేషెంట్ విభాగం, అబా రిజిస్ట్రేషన్ ప్రాంతం, మామోగ్రఫీ, బ్రాకీ థెరపి మొదలైన అధునాతన క్యాన్సర్ సౌకర్యాలు వున్న రేడియేషన్ అంకాలజీ యూనిట్, ఇన్‌పేషెంట్ వార్డులు, క్యాజువాలిటీని సందర్శించారు. ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ డాక్టర్ అహంతమ్ శాంతాసింగ్ సంస్థ సాధిస్తున్న పురోగతిని శ్రీవాస్తవకు వివరించారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ


