భట్టిప్రోలు: మీ భూమి–మీ హక్కు కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని సూరేపల్లిలో గురువారం నిర్వహించిన ప్రజా వేదిక సభకు ముఖ్య అతిథిగా చంద్రబాబు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిరోరక్ష – ప్రాణ రక్ష స్టాల్‌ను సీఎం పరిశీలించారు. జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ సీఎంకు వివరించారు. శిరో రక్ష–ప్రాణరక్ష కార్యక్రమం ద్వారా హెల్మెట్ వాడకంపై విసృత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి హెల్మెట్ ధరించడం తప్పని సరి చేస్తున్నామని చెప్పారు. నిరంతర కృషి వల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో 9.47 శాతం తగ్గుదల, మరణాల్లో 11.63 శాతం గణనీయమైన తగ్గుదల నమోదయిందని తెలిపారు. ఈ గణాంకాలను పరిశీలించిన సీఎం జిల్లా ఎస్పీని అభినందించారు.
జిల్లా ఎస్పీకి ఐజీ అభినందనలు..
భట్టిప్రోలు: పటిష్ట ప్రణాళికతో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సమర్ధవంతంగా బందోబస్తు నిర్వహించిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ను గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి అభినందించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అద్భుతమైన ప్రణాళికతో బందోబస్తును సమర్ధవంతంగా నిర్వహించిన విధానాన్ని త్రిపాఠి అభినందించారు. అదేవిధంగా బందోబస్తు విధులను సమర్ధవంతంగా నిర్వహించిన పోలీస్, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.


