లక్ష్మీపురం: ఇంటి పనులు, బయట పనులతో శ్రమిస్తూ ఉత్పత్తిలో ముఖ్య భూమిక పోషిస్తున్న శ్రామిక మహిళలకు హక్కులు కల్పించటంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని సీఐటీయూ ఆలిండియా సెక్రటరీ ఎస్.వరలక్ష్మి అన్నారు. సీఐటీయూ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర 10వ సదస్సు మంగళవారం విజయలక్ష్మి, శేషకుమారి, జి.నాగమణి, సీత అధ్యక్షతన గుంటూరు బ్రాడీపేటలోని జాషువా విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాల ప్రకారం సముచిత, గౌరవప్రదమైన ఉద్యోగాలు భారతదేశంలో లేవన్నారు. ఐఎల్‌ఒ ప్రకారం కార్మికులకు న్యాయమైన వేతనాలు అమలు చేయాల్సి ఉందని, కానీ కనీస వేతనాలు కూడా అమలు చేయట్లేదన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ రాజ్యాంగం సీ్త్ర, పురుషులకు సమానహక్కులు కల్పించినా వేతనాలలో వివక్ష కొనసాగుతుందన్నారు. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కట్లేదన్నారు. శ్రామిక మహిళ రాష్ట్ర కన్వీనర్ కె.ధనలక్ష్మి నివేదిక ప్రవేశపెట్టారు. పలు తీర్మానాలు ఆమోదించారు.


