గుంటూరు రూరల్: ఇటీవల కాకినాడ జేఎన్టీయూలో నిర్వహించిన 12వ స్నాతకోత్సవ వేడుకల్లో విజ్ఞాన్ నిరులా ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఐటీ విభాగ విద్యార్థిని గుండా ప్రియాంకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోవడం విశేష గౌరవంగా నిలిచిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీ రాధిక తెలిపారు. సోమవారం పెదపలకలూరు రోడ్డులోని కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థిని అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ గుండా ప్రియాంక తన కృషి, పట్టుదల, అంకితభావంతో ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకుని సంస్థకు మరింత ఖ్యాతిని తీసుకువచ్చిందన్నారు. ఆమె సాధించిన ఈ విజయం ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. ప్రియాంకను విజ్ఞాన్ సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, ఉపాధ్యక్షులు లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఐటీ విభాగాధిపతి డాక్టర్ కె.వి.ఎస్. రామకృష్ణ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.


