సమస్యలు సత్వరం పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు సత్వరం పరిష్కరించండి

Apr 7 2026 8:01 AM | Updated on Apr 7 2026 8:01 AM

జాయింట్‌ కలెక్టర్‌ భావన వశిష్ట

కొల్లూరు: ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భావన వశిష్ట అన్నారు. సోమవారం కొల్లూరు మండల పరిషత్‌ కార్యాలయంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులు కట్టుబడి ఉండాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో సమస్యలపై వచ్చిన అర్జీలను శాఖల వారీగా సంబంధిత అధికారులు పరిశీలించి, నెల రోజుల వ్యవధిలో క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని సూచించారు. పలు సమస్యలపై 75 అర్జీలు అందినట్లు పేర్కొన్నారు. ప్రధానంగా కృష్ణానదీ వరదలు, తుపాను కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని సీఐటీయూ నాయకులు అర్జీ అందించారు. జొన్న, మొక్కజొన్న పంట ఉత్పత్తులకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ జేసీకి అర్జీలు అందజేశారు. వీటితోపాటు స్మశాన స్థలాలు, చుక్కల భూముల సమస్యలు, వివాదాస్పద డొంకరోడ్డు సమస్యలను పరిష్కరించాలని అర్జీలు అందాయి. కార్యక్రమంలో భూ రికార్డ్స్‌ సర్వే శాఖ ఏడీ సాంబశివరావు, ప్రత్యేక అధికారిణి పద్మావతి, ఎంపీడీఓ ఎ.స్పందన, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement