భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పేరాల పోలేరమ్మ తల్లి ● గత 50 ఏళ్లుగా జరుగుతున్న తిరునాళ్ల మహోత్సవాలు
● నేడు శిడిమహోత్సవం, తిరునాళ్ల తిరునాళ్ల విశిష్టత..
● ప్రతి ఏడాది అమ్మవారి తిరునాళ్ల, శిడి మహోత్సవాన్ని ఘనంగా జరుపుతారు. తిరునాళ్ల రోజు శిడి పెళ్లి కొడుకుతో ఊరేగింపుగా అమ్మవారి గుడికి వెళ్తారు. గుడి వద్ద ఉండే శిడిమానుకు ఒక పెట్టెలో మేకపోతు నుంచి, గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తారు. ఈ సమయంలో శిడిమాను పైభాగంలో చెక్కపెట్టెలో ఉంచిన మేకపోతును భక్తులు జీడికాయలతో కొడుతుంటారు. శిడిమాను లాగితే కష్టాలు తొలిగిపోతాయని భావించే భక్తులు శిడిమాను బండిని లాగేందుకు పోటీ పడతారు. తిరునాళ్ల సందర్భంగా ప్రత్యేకంగా ఎల్‌ఈడీ విద్యుత్ ప్రభలు ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రభలతో పాటు మ్యూజికల్ నైట్, నాటికలు, కళాకారులతో ప్రదర్శనలు, అన్నదానాలు నిర్వహించనున్నారు. తిరునాళ్లను పురస్కరించుకొని పశుసంపదతో పాటు వాహనాలను గుడి చుట్టూ తిప్పి ప్రజలు తమ మొక్కులు తీర్చుకుంటారు. చీరాలతో పాటు పరిసర గ్రామాల నుంచి తిరునాళ్లను చూసేందుకు ప్రజలు వేలాది సంఖ్యలో వస్తుంటారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పేరాల పోలేరమ్మ తల్లి
చీరాల: కోరిన కోర్కెలు తీర్చి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న పేరాల పోలేరమ్మ తల్లి శిడిమహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరగనుంది. పోలేరమ్మ గుడి స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయి 51వ సంవత్సర తిరునాళ్ల జరగనున్నాయి. మంగళవారం శిడి మహోత్సవం, తిరునాళ్ల జరగనున్నాయి.
చీరాల పట్టణంలో జరిగే పోలేరమ్మ తిరునాళ్లకు ఎంతో విశిష్టత ఉంది. స్థానిక హరిప్రసాద్‌నగర్‌లో పోలేరమ్మ తల్లి వేంచేసి ఉంది. గత 50 ఏళ్లుగా ప్రతి ఏడాది అమ్మవారి తిరునాళ్లను ఘనంగా నిర్వహిస్తారు. శక్తి స్వరూపం కలిగి, భక్తుల పాలిట కొంగు బంగారంగా ఉండే పోలేరమ్మ అమ్మవారి గుడి అంటే చీరాల ప్రాంతంలో ప్రసిద్ధి. తొలుత స్థానిక గ్రామస్తులు చిన్న గుడిని ఏర్పాటు చేసి అమ్మవారిని స్థాపించగా ప్రస్తుతం ఆ దేవాలయం దినదినాభివృద్ధి చెంది పట్టణంలోనే విశిష్టత కలిగిన అమ్మవారిగా పేరు పొందింది. దేవాలయం అభివృద్ధిలో దేవస్థాన కమిటీ, సభ్యులు విశేష కృషి చేశారు. ప్రతి మంగళ, ఆదివారాల్లో భక్తులు విరివిరిగా వచ్చి విశేష పూజలు నిర్వహిస్తుంటారు. ఆపదలో ఉన్న భక్తుల కష్టాలు, కోర్కెలను తీర్చే తల్లిగా పోలేరమ్మ తల్లికి పేరుంది.