గుంటూరు ఎడ్యుకేషన్: పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల జవాబు పత్రాలకు మూల్యాంకన ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. నల్లచెరువు మెయిన్‌రోడ్డులోని మహావీర్ మెమోరియల్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో మూల్యాంకన విధులకు నియమించిన ఉపాధ్యాయులు హాజరయ్యారు. స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించిన ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి, డీఈవో షేక్ సలీమ్ బాషా ఉపాధ్యాయులకు విధులను అప్పగించారు. గుంటూరుజిల్లాలో మూల్యాంకనం జరిపేందుకు ప్రభుత్వం 1,83,369 ఆన్సర్ స్క్రిప్ట్‌లను కేటాయించగా, వాటికి 10రోజుల వ్యవధిలో మూల్యాంకనం నిర్వహించాల్సి ఉంది. ఇందుకు గానూ చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్‌లతో పాటు స్పెషల్ అసిస్టెంట్స్ విధుల్లో వివిధ కేడర్లకు చెందిన 950 మంది ఉపాధ్యాయులను నియమించారు. అదే విధంగా అనారోగ్య పరిస్థితులతో పాటు వివిధ కారణాలతో స్పాట్ వాల్యూయేషన్ విధుల నుంచి మినహాయింపు కోరుతూ ఉపాధ్యాయులు అధికారుల ఎదుట క్యూ కట్టారు. ఉపాధ్యాయుల ఇబ్బందులు తెలుసుకున్న అధికారులు వారి నుంచి మెడికల్ సర్టిఫికెట్లు, ధ్రువపత్రాలు పరిశీలించి విధుల నుంచి మినహాయింపు కల్పించారు.
నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన..
సమస్యలు పరిష్కరించని ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం నల్లచెరువు మెయిన్‌రోడ్డులోని మహావీర్ మెమోరియల్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన టెన్త్ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో ఫ్యాప్టో పిలుపు మేరకు ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలను ధరించి విధులకు హాజరయ్యారు. ఈసందర్భంగా ఫ్యాప్టో గుంటూరు జిల్లా చైర్మన్ కె.నరసింహారావు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ప్రభుత్వానికి నిరసన తెలియజేశామని, ఇందులో భాగంగా నల్లబ్యాడ్జీలతో స్పాట్ వాల్యూయేషన్ విధులకు హాజరవుతున్నట్లు చెప్పారు. ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ యు.రాజశేఖర్‌రావు, మహమ్మద్ ఖాలీద్, జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ బాజీ, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


