చేబ్రోలు: చేబ్రోలులోని కొమ్మమూరు బ్రిడ్జి ప్రాంతంలో సోమవారం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. చేబ్రోలు శివారులోని కొమ్మమూరు బ్రిడ్జిపై నుంచి చానల్‌లోకి ప్రమాదవశాత్తూ టిప్పర్ బోల్తా పడిపోవటంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పేరేచేర్ల ప్రాంతానికి చెందిన టిప్పర్ మెటల్‌ను లోడ్ చేసుకొని దిగుమతి చేసి తిరిగి బయలుదేరింది. చేబ్రోలు శివారులోని కొమ్మమూరు బ్రిడ్జి సమీపంలోకి వచ్చే సమయానికి టిప్పర్ అదుపుతప్పి బ్రిడ్జి రైయిలింగ్‌ను ఢీకొని సుమారు 25 అడుగుల లోతున ఉన్న కొమ్మమూరు చానల్‌లో బోల్తా పడింది. ఈ సంఘటనలో టిప్పర్ డ్రైవర్ కసుకర్తి లక్ష్మయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. చేతులు, కాళ్లు, నడుంకు బలమైన గాయాలైన డ్రైవర్ లక్ష్మయ్యను 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్ బ్రిడ్జి రైయిలింగ్‌ను ఢీకొని ఛానల్‌లో పడిపోయిన సమయంలో ఎదురుగా ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బ్రిడ్జి పై భాగంలో ఆర్‌టీసీ బస్సును ఢీకొట్టి ఉంటే పెను ప్రమాదం జరిగిన ప్రాణ నష్టం జరిగే ఉండేదని స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. పొన్నూరు వైపు నుంచి వస్తున్న టిప్పర్ కట్టెంపూడి అడ్డరోడ్డు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. మునిపల్లె వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని, మంచాల గ్రామం వద్ద అతివేగంగా వాహనాన్ని నడిపిన డ్రైవర్ చివరకు కొమ్మమూరు బ్రిడ్జిపై నుంచి చానల్‌లోకి బోల్తా కొట్టినట్లు వాహనదారులు తెలిపారు.


