చదునుచేసి ఆక్రమించుకున్న అధికార పార్టీ నేత
నరసరావుపేట: నరసరావుపేటలో ప్రభుత్వ స్థలాలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులను లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారు. ఖాళీ ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు..దానిపై కర్చీఫ్ వేసి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక బరంపేటలోని కాపుల ఆరామక్షేత్రం–స్టేడియం గోడకు మధ్యనున్న రూ.కోటి విలువైన సుమారు ఏడు సెంట్ల మున్సిపల్ స్థలంపై నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి అనుచరుడి కళ్లు పడ్డాయి. ఇతను బీసీ కాలనీలో ఉంటూ అధికార పార్టీ కార్యకలాపాలకు కేంద్రంగా ఉంటాడు. రెండు రోజుల నుంచి ఈ స్థలాన్ని ప్రొక్లయినర్‌తో చదును చేశాడు. సమీపంలోని మహిళలు ఇదేమిటని ప్రశ్నించే ప్రయత్నం చేయగా వారిని తన రౌడీల సహాయంతో బెదిరించాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో సెంటు భూమి ధర రూ.15లక్షలు ఉంటుందని చెబుతున్నారు. పట్టణంలో భూముల ధరలు విపరీతంగా పెరగటంతో అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలపై కన్నేశారు. సత్తెనపల్లిరోడ్డులోని కత్తవ కాలువ స్థలాన్ని కొంతమంది ఆక్రమించేందుకు ప్రయత్నించగా స్థానిక ప్రజల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో ఇటీవలనే మున్సిపల్ అధికారులు ఆక్రమణలను తొలగించారు. దీనిని కూడా స్వాధీనం చేసుకొని అక్రమార్కుల నుంచి విలువైన స్థలాన్ని కాపాడాలని కోరుతున్నారు. దీనిపై మున్సిపల్ టీపీఓ సాంబయ్యను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.


