రేపల్లె: చేనేత, పవర్‌లూమ్ రంగాలకు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చేనేత జౌళిశాఖ అభివృద్ధి అధికారి సిహెచ్ ప్రశాంత్ అన్నారు. ఇసుకపల్లిలోని చేనేత సహకార సంఘం కార్యాలయంలో శనివారం చేనేత కార్మికులతో నిర్వహించిన గ్రామసభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చేనేత కార్మిక కుటుంబాలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌కు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో నేతన్నల కుటుంబాలకు ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. చేనేత కుటుంబాలకు విద్యుత్ వినియోగం కేవలం గృహ అవసరాలకే పరిమితం కాకుండా వారి వృత్తి నిర్వహణలో సైతం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 93వేల చేనేత కుటుంబాలు, 11,488 పవర్‌లూమ్ యూనిట్ల ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ పథకం అమలు తీరు వివరాలను తెలిపారు. మాజీ కౌన్సిలర్ ఆకురాతి గంగమ్మ, మేనేజర్ కౌతరపు శోభన్‌బాబు, చేనేత నాయకులు ముత్తవరపు స్వతంత్ర తేజ్‌కుమార్, కేవీ నాంచారరావు, అడిగోపుల వీరశంకర్, సీతారామయ్య పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
చేనేత జౌళిశాఖ అభివృద్ధి అధికారి ప్రశాంత్


